TT Ads

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ప్రజల కోసం పనిచేశారు. నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లారు. ఫలితం ప్రస్తుతం ఆయన ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే… తరతరాలు బతికేలా డబ్బు పోగేస్తున్న నేటి సమాజంలో… ఇలాంటి వారు ఉండటం అరుదనే చెప్పాలి. కేవలం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి… నేడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడం వల్ల కూతురి ఇంట్లో తలదాచుకుంటున్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. సొంత ఇల్లు కూడా లేకపోవడం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు.

కుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడివి వెంకన్న గూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొజ్జి… చిన్నప్పుడే సీపీఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొజ్జి… కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

సైకిల్​పై…

మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా… ఏనాడు లొంగలేదు. పార్టీ, ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచిపేరు గడించిన కుంజా బొజ్జి… భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్​పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్​పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే…

కుంజా బొజ్జి, లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతిచెందగా ఒంటరయ్యారు కుంజాబొజ్జి. 95 ఏళ్ల వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా, వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేటి తరానికి ఆదర్శం…

ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొజ్జి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు… కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం, ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొజ్జి… ఇప్పటితరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *