TT Ads

ఏప్రిల్ 07 సత్తుపల్లి: సామాజిక రాజకీయ హక్కుల కోసం దళితులంతా ఏకమై పోరాటాలకు సంసిద్ధం కావాలని ఏఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి విస్తృత స్థాయి‌ సమావేశం బుధవారం సత్తుపల్లి స్థానిక శాధిఖానా లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మందా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ పట్టాణాలు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో కుల వైషమ్యాలు తొలగించాల్సిన భాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

స్వతంత్ర్య భారతంలో కులం, మత వైషమ్యాలు హెచ్ఛుమీరుతున్నాయని నేటికి దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, దమనకాండపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు నోరు మేదపకుండా దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిసినా దళితుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పుకు నోచుకోలేదని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను అమలు చేయడంలో నేటి ప్రభుత్వ పాలకులు విఫలమౌతున్నారని అన్నారు.

ఏడు దశాబ్దాలు కాలంలో దళితులు ఇంకా ఎనకబడి ఉన్నారనడంలో అతిశయోక్తి లేదని సమానత్వం సామాజిక న్యాయం కుల వివక్షత నిర్మూలన రాజకీయ ఆర్థికాభివృద్ధి కాగితాలకే పరిమితమైనాయని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని‌, దళితుల అభ్యున్నతి కోసం రూపొందించిన చట్టాలు, రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందని దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోని దళిత ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ నేటికీ అమలు చేయక పోగా దశాబ్దాలుగా దళితులు సాగుచేసుకుంటున్న భూములు హరిత హారం, ప్రాజెక్టుల పేరుతో లాకుంటూ నేడు దళితులకు బ్రతుకు లేకుండా చేస్తున్నారని. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం ప్రకటించిన హామిల అమలుకై దళితులంతా ఏకమై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, డిహెచ్ పిఎస్ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తడికమల్ల యోబు, ఏఐటియుసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాల్ రావు, డిహెచ్ పిఎస్ డివిజన్ అధ్యక్షులు కొత్తపల్లి కుమార్, కిన్నెర నాగలక్ష్మి, గద్దల నాగరాజు,నాగేంద్రమ్మ, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *