TT Ads

మ‌నుషులంద‌రూ స‌మాన‌మ‌ని డా.బి.ఆర్‌.అంబేద్కర్ చెప్పార‌ని, ఎలాంటి భేద‌భావం లేకుండా సాటి మ‌నిషిని గౌర‌వించ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్ 130వ జ‌యంతి వేడుక‌లు తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ ఆనాటి ప‌రిస్థితుల్లో ఉన్న వివ‌క్ష కార‌ణంగా ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొన్న అంబేద్క‌ర్ విద్య‌ను ఆయుధంగా చేసుకుని ఉన్న‌తస్థితికి చేరుకున్నార‌ని చెప్పారు. అపూర్వ‌మైన మేథాశ‌క్తి, నాయ‌క‌త్వ ప‌టిమ‌తో అణ‌గారినవ‌ర్గాల గొంతుక‌గా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపార‌ని తెలిపారు. విద్య‌, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి అట్ట‌డుగువ‌ర్గాల వారి ఎదుగుద‌ల‌కు కృషి చేశార‌ని వివ‌రించారు. కుల‌నిర్మూల‌నకు ఎంత‌గానో కృషి చేశార‌ని చెప్పారు. ఐక్య‌రాజ్య‌స‌మితి 2015 నుండి 2030వ సంవ‌త్స‌రం వ‌ర‌కు పేద‌రిక నిర్మూల‌న‌, అంద‌రికీ స‌మాన అవకాశాల క‌ల్ప‌న‌, వివ‌క్ష‌ను రూపుమాప‌డం అనే ల‌క్ష్యాలు పెట్టుకుంద‌ని, ఇవి అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని అన్నారు. అంబేద్క‌ర్ సిద్ధాంతాలను అంద‌రూ పాటించాల‌ని, ఇందుకు త‌గ్గ‌ట్టు టిటిడి ఉద్యోగులు వారి పిల్ల‌ల‌ను చ‌క్క‌గా చ‌దివించాల‌ని, మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పాల‌ని సూచించారు. టిటిడి ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ‌స్థాయిలో ఇనుమ‌డింప‌చేసేలా ఉద్యోగులు సేవ‌లందించాల‌ని కోరారు.

వేదాలు, పురాణాల సారం స‌మాన‌త్వ‌మే : శ్రీ ఎస్‌.గ‌గారిన్‌,వేదాలు, పురాణాలు, భ‌గ‌వ‌ద్గీత త‌దిత‌ర గ్రంథాల‌తోపాటు ఋషులు, మ‌హ‌ర్షులు, క‌వులు, మేథావులు మ‌నుషులంద‌రూ స‌మాన‌మేన‌ని మ‌నకు బోధించార‌ని, దీన్ని అంద‌రూ ఆచ‌రించాల‌ని ముఖ్య వ‌క్త‌ చెన్నైకి చెందిన ద‌క్షిణ రైల్వే ఐఆర్‌టిఎస్ అధికారి శ్రీ ఎస్‌.గ‌గారిన్ కోరారు. శ్రీ‌వారి ప‌ర‌మభ‌క్తుడైన శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 500 సంవ‌త్స‌రాల క్రిత‌మే బ్ర‌హ్మ‌మొక్క‌టే ప‌ర‌బ్ర‌హ్మ‌మొక్క‌టే సంకీర్త‌న‌లో స‌మాన‌త్వాన్ని నొక్కి చెప్పార‌ని, ఇదే విష‌యాన్ని అంబేద్క‌ర్ ప‌విత్ర మాన‌వ స్వ‌రూపమ‌ని చెబుతూ సాటి మ‌నిషిని గౌర‌వించాల‌ని సూచించార‌ని చెప్పారు. మ‌హ‌నీయుల జ‌యంతి కార్య‌క్ర‌మాల ద్వారా మాన‌వ వ్య‌క్తిత్వాన్ని పున‌రుజ్జీవింప చేస్తున్న టిటిడికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి వంద‌న స‌మ‌ర్ప‌ణ చేస్తూ మ‌హ‌నీయుల జ‌యంతి కార్య‌క్ర‌మాల‌ను ఇంత పెద్ద ఎత్తున నిర్వ‌హించేందుకు అనుమ‌తిచ్చిన ఈవోకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. టిటిడి ఉద్యోగులంద‌రూ స‌మభావ‌న‌తోనే ఉన్నార‌ని చెప్పారు.

అంతకుముందు అతిథులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, డా.బి.ఆర్‌.అంబేద్కర్ చిత్ర‌పటానికి పుష్పాంజలి ఘటించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం ప‌లువురు ఉద్యోగుల‌కు క‌మ్యూన‌ల్ అవార్డులు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన ఉద్యోగుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి పిఆర్వో డా. టి.ర‌వి, డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు, ఎస్‌సి లైజ‌న్ అధికారి శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, బిసి లైజ‌న్ అధికారి శ్రీ భ‌ర‌త్ గుప్త, ఉద్యోగులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *