TT Ads

కృష్ణ నదీ యాజమాన్య బోర్డు(కె.ఆర్. ఎం. బి) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల శక్తి రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆమోదించిన నేపథ్యంలో శ్రీశైలం ఎగువ భాగాన ఏవిధమైన అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు దిండి 30 టిఎంసిలు మొత్తం 120 టీఎంసీలుతో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులు కూడా కె.ఆర్. ఎం. బి పరిధిలో చేరుస్తున్నారు అని సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం విజయవాడ కస్తూరిబాయి పేట లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయ రాజు అందుబాటులో ఉన్న కార్యవర్గ సభ్యులతో అత్యవసరంగా సమావేశమై చర్చించి తదుపరి కార్యాచరణ నిమిత్తం ప్రణాళిక రూపొందించారు.

అనంతరం ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ భాగాన కృష్ణానదిపై సిడబ్ల్యుసి, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 కు వ్యతిరేకంగా 2015 లోనే పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టిఎంసిలు, మొత్తం 120 టీఎంసీల తో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రైతుల తరపున తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 116 ద్వారా 2016రులో దాఖలు చేయగా దీనిమీద వాదోపవాదాలు జరిగిన సమయంలో ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవే అని రాష్ట్ర విభజన తర్వాత చట్ట వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిందని దీని మీద 2016 సెప్టెంబర్ లో జరిగిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ లోనూ, 2020 అక్టోబర్ లో జరిగిన రెండవ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదనివాస్తవం ఇలా ఉంటే కేంద్ర జల శక్తి శాఖ ప్రస్తుతం కె.ఆర్ ఎం బి పరిధి నిర్ణయించే క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం, ఎస్ ఆర్ ఎస్ పి తో పాటు కొత్త ప్రాజెక్టులు అయిన పాలమూరు – రంగారెడ్డి , దిండి ఎత్తిపోతల పథకాలను కె.ఆర్. ఎం. బి పరిధిలోకి చేర్చటం చాలా దారుణం అని ఈ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దొడ్డిదారిలో అమల్లోకి వస్తే శ్రీశైలం దిగువ భాగాన అన్ని రకాల అనుమతులు ఉన్న నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల క్రింద ఉన్న గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న 15 లక్షల ఆయకట్టు, కృష్ణా డెల్టా కింద కృష్ణా ,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 13 లక్షల ఆయకట్టు మొత్తం 28 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుబారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడి ఈ రెండు ప్రాజెక్టులను కె.ఆర్. ఎం. బి పరిధిలో చేర్చటానికి ఒప్పుకుంటే భావితరాలకు అన్యాయం జరిగి భవిష్యత్తులో చుక్కనీరు కూడా ఆంధ్ర ప్రాంతానికి రాదని దీనిమీద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీపడకుండా అవసరమైతే న్యాయ పోరాటం చేసి ఆంధ్ర ప్రాంత రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బచావత్ మరియు బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ కు 511 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలిక ఏర్పాటు చేయగా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన 299 టీఎంసీలలో 90 టిఎం సి లు చిన్న నీటి పారుదలకు పోగా , నీటిపారుదల ప్రాజెక్టులకు 209 టీఎంసీలు మాత్రమే కేటాయింపు ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టిఎంసిలు, మిషన్ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాస 6 టిఎంసిలు, తులిమెల్ల ఆరు టిఎంసిలు మొత్తం 150 టీఎంసీల తో కొత్త ప్రాజెక్టులు అలాగే ఇప్పటికే ఉన్న ఎస్ ఎల్ బి సి 40 టీఎంసీలు, కల్వకుర్తి 40 టీఎంసీలు, నెట్టెంపాడు 25 టిఎంసిలు, మొత్తం 105 టీఎంసీల తో విస్తరించి మొత్తం 255 టీఎంసీల తో శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాం, ప్రకాశం బ్యారేజ్ కి భవిష్యత్తులో చుక్క నీరు రాని పరిస్థితి వస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు కూర్చోకుండా అఖిలపక్ష సమావేశం వెంటనే ఏర్పాటు చేసి నీటిపారుదల రంగ నిపుణుల తో చర్చించి ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి, కేంద్ర హోం మంత్రి దృష్టికి వెంటనే తీసుకువెళ్లి ఆంధ్ర రైతుల చట్టబద్ధమైన నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీని మీద సాగునీటి సంఘాల ప్రతినిధులుగా తమకు అవకాశం ఉన్న అన్ని పద్ధతిలోనూ ఆంధ్ర రైతులకు న్యాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని దీనిమీద రేపు పూర్తి వివరాలతో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి కి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయ రాజు(పశ్చిమ గోదావరి జిల్లా ), ఉపాఅధ్యక్షులు జి వి భుజంగరాయలు (గుంటూరు జిల్లా ),సంయుక్త కార్యదర్శి జాగర్లమూడి అనిల్ బాబు(ప్రకాశం జిల్లా ), కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మల లక్ష్మణ రావు (కృష్ణ జిల్లా ) తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *