TT Ads

చీమకుర్తి,: తరచూ చిరాకు పెడుతోందంటూ రోకలి బండతో మోది కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ వ్యక్తి.

ఈ సంఘటన చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై నాగశివారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన నారాయణమ్మ(29)కు మర్రిచెట్లపాలేనికి చెందిన గురవయ్యతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది.

గురవయ్య వాలంటీర్‌గా, సెల్‌ఫోన్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. నారాయణమ్మ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున రోకలి బండతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం గురవయ్య పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ప్రతి విషయంలోనూ తనను చిరాకు పెడుతోందని.. భరించలేక రోకలి బండతో దాడికి పాల్పడినట్టు గురవయ్య తెలిపారు. ఒంగోలు గ్రామీణ సీఐ పి.సుబ్బారావు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ, ఎస్సై తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *