TT Ads

కడప: కడప జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంపై సీసీఎల్‌ఏ(భూపరిపాలన ప్రధాన కమిషనర్‌) కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మైలవరం మండల తహసీల్దారు ఉద్యోగవిరమణకు కొన్నిరోజుల ముందు నిబంధనలకు విరుద్ధంగా జిరాయితీ పట్టాలు మంజూరు చేసిన తీరును.’100 ఎకరాలు కొట్టేశారు!’ శీర్షికన ఈనెల 4న ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది.
దీనిపై సీసీఎల్‌ఏ స్పందించి.సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప జిల్లా సంయుక్త పాలనాధికారిని ఆదేశించారు. కొట్టే వెంకట శివరామయ్య తహసీల్దారుగా పనిచేసినప్పుడు 254 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పిడులు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అంశంపై కడప జిల్లా సంయుక్త పాలనాధికారి(జేసీ) గౌతమి సోమవారం విలేకరులతో మాట్లాడారు.

కె.వి.శివరామయ్య తహసీల్దారుగా ఉద్యోగవిరమణ చేసేముందు మైలవరం మండల రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా చేసిన మార్పులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ వ్యవహారంలో తహసీల్దారు, అక్కడ పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ కీలకపాత్ర పోషించినట్లు గుర్తించాం. పొరుగుసేవల కింద పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ని ఇప్పటికే విధుల నుంచి తొలగించాం. ఆ విశ్రాంత తహసీల్దారుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం.

రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి అందకుండా చూస్తాం. ఆ తహసీల్దారు హయాంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పిడులన్నింటినీ పరిశీలించి వాటిపైనా తగిన చర్యలు తీసుకుంటాం. ఆయా వీఆర్వోల పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సీసీఎల్‌ఏకి నివేదిక అందజేస్తాం.

సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. తక్కువ సమయంలో వెబ్‌ల్యాండ్‌లో చేసిన మార్పుచేర్పులపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వెబ్‌ల్యాండ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీసీఎల్‌ఏకు సలహాలు, సూచనలు పంపిస్తాం’ అని జేసీ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *