TT Ads

రాయచోటి ప్రాంతానికి చెందిన కుర్రాడు ప్రతిష్టాత్మక ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. రాయచోటి నియోజవర్గం చిన్నమండెం మండలం బోనమల గ్రామం నాగూరివాండ్లపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవిలది వ్యవసాయం కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉపాధికోసం కువైతలో ఉన్నారు. రెండవ కుమారుడు మారం హరిశంకర్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతను బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనపర్చడంతో అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడ్డం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఇతడిని రూ.20 లక్షలకు దక్కించుకున్నారు.

హరిశంకర్‌రెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తమ కొడుక్కి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం అని, కాలేజీకి కూడా సరిగా పోకుండా ఎక్కడ ఏ చిన్న టోర్నమెంట్‌ జరిగినా వెళ్లి ఆడుతుండడంతో చాలా బాధపడే వాళ్లమని, ఈ రోజు ఐపీఎల్‌కు తమ కొడుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని హరిశంకర్‌రెడ్డి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఐపీఎల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతానికి చెందిన ఇతను ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల.. పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ప్రతిభ కనపరచి.. భారత జట్టుకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *