TT Ads

దిల్లీ: రద్దైన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 13 మంది నిపుణుల కమిటీ తయారు చేసిన మూల్యాంకన కమిటీ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఎస్‌ఈ గురువారం సమర్పించింది. సీఐఎస్‌సీఈ కూడా తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జులై 31లోపు ప్రకటిస్తామని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. అయితే తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని తెలపాలంటూ బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సమర్పించాయి. వాటిని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆమోదించింది.

ఎలా మదింపు చేస్తారంటే:12 వతరగతి తుది ఫలితాల ప్రకటనలో సీబీఎస్‌ఈ.. 10,11,12 తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోనుంది. ఇందులో 10,11వ తరగతి తుది పరీక్షల్లో సాధించిన మార్కులకు 30 శాతం, 12వ తరగతి ప్రీబోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం వెయిటేజీ కేటాయించనుంది. పదో తరగతి ఫైనల్‌ పరీక్షలో ఐదు పేపర్లలో అత్యధిక మార్కులు సాధించిన మూడు పేపర్లను 30 శాతం వెయిటేజీకి పరిగణనలోకి తీసుకుంటారు. 11వ తరగతి తుది పరీక్షల్లోని అన్ని పేపర్లను వెయిటేజీకి లెక్కలోకి తీసుకుంటారు. 12వ తరగతి 40 శాతం వెయిటేజీని.. యూనిట్‌ టెస్టు/మిడ్‌ టెర్మ్‌/ప్రీబోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మదింపు చేస్తారు. ప్రాక్టికల్స్‌, ఇంటర్నల్స్‌ మార్కులను యథాతథంగా తీసుకుంటారు. ఈ 30:30:40 ఫార్ములాకు ఆమోదం తెలిపిన ధర్మాసనం.. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సీఐఎస్‌సీఈ కాస్త భిన్నమైన మూల్యాంకన విధానాన్ని ప్రకటించింది. 12వ తరగతి తుది ఫలితాల మూల్యాంకనానికి పదో తరగతి థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. 11,12 తరగతులకు సంబంధించి పాఠశాలలో నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో సాధించిన అత్యధిక మార్కులను లెక్కలోకి తీసుకోనుంది. గత ఆరు సంవత్సరాల్లో విద్యార్థి అత్యుత్తమ ప్రతిభను అంచనా వేసి తుది ఫలితాలను ప్రకటించనుంది.

ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు:సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దైన నేపథ్యంలో రాష్ట్రబోర్డుల 12వ తరగతి అంశం కూడా గురువారం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. 24 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, అందులో ఆరు.. కరోనా రెండో ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనర్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, పంజాబ్‌, అస్సాం మాత్రం ఇంకా రద్దు చేయలేదని పేర్కొన్నారు. దీంతో రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ జరపనుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *