TT Ads

జూబ్లీహిల్స్‌ : మీరు అందంగా ఉన్నారంటూ ఓ వైద్యురాలిని వేధిస్తున్న ఓ శాడిస్ట్‌.. ఆమెను నిత్యం వెంటాడేందుకు ఆమె కారుకు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) పరికరాన్ని అమర్చాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు మనుషులనూ నియమించుకున్నాడు. నాలుగు నెలల నుంచి వేధింపులు భరించలేని వైద్యురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వివరాలను జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.
వైద్యురాలి ఆపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ : జుట్టు రాలిపోతుందంటూ ఆసుపత్రికి వెళ్లిన విశ్వనాథ్‌ తనతో స్నేహం చేయాలంటూ ఆ వైద్యురాలిని బలవంతం చేశాడు. ఆమెకు సన్నిహితంగా ఉండాలని ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి నాగరాజు పేరుతో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుండేవాడు.వైద్యురాలి కుమారుడికి బొమ్మలు ఇచ్చి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. నీడలా వెంటాడేందుకు ఆమె కారుకు జీపీఎస్‌ అమర్చి నిఘా పెట్టాడు. ఆమె కుమారుడికి తండ్రి గురించి లేనిపోని మాటలు కల్పించి చెప్పేవాడు. దీంతో బాధితురాలు ఫ్లాట్‌ను ఖాళీ చేసింది. మరో ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది.
నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..: నిందితుడు విశ్వనాథ్‌ అక్కడికీ వెళ్లాడు. ఆమె పని చేస్తున్న ఆసుపత్రి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆమె కుమారుడిని తన వద్ద వదలాలని, లేదంటే హతమారుస్తానంటూ బెదిరించడంతో వేధింపులు పడలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. విశ్వనాథ్‌ను హెచ్చరించేందుకు రెండు రోజుల క్రితం వెళ్లగా.. విశ్వనాథ్‌ అతడి స్నేహితుడు సురేష్‌లు తెరాస నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌ ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నాడు.ఉల్టా బెదిరింపులు..: విశ్వనాథ్‌ తన భార్యను వేధిస్తున్నాడంటూ వైద్యురాలి భర్త వెళ్లి శ్రీకాంత్‌గౌడ్‌కు చెప్పారు. దాంతో అతనిని ఉల్టా బెదిరించాడు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శ్రీకాంత్‌గౌడ్‌ హెచ్చరించాడు. దీంతో వైద్యురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్‌, సురేష్‌, పులి శ్రీకాంత్‌ పటేల్‌ గౌడ్‌, నాగరాజులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *