TT Ads

హైదరాబద్:అమ్మ అనే పిలుపు కోసం ఆరేళ్లు ఎదురు చూసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా మాతృప్రేమను పంచకుండానే ఆ తల్లి కన్నుమూసింది. బంధాలు.. బంధుత్వాలను దూరం చేస్తున్న మాయదారి కరోనా ఓ బాలింతను బలితీసుకుంది. గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ కూతురు భవానీ(27)కి చింతల్‌బస్తీకి చెందిన కార్తీక్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అన్నీ ఉన్నా ఆ దంపతులను పిల్లల్లేని లోటు వెంటాడేది. ఆలుమగల ప్రార్థనలు ఫలించాయి. ఏప్రిల్‌ 23న భవానీ పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఈ ఆనందం రెండ్రోజులు కూడా నిలువలేదు. ఆ మరుసటిరోజే ఆమెకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తల్లీబిడ్డలను వేరుగా ఉంచారు. రెండ్రోజులు చికిత్స తరువాత ఇంటికి పంపారు. ఇంట్లో ఆక్సిజన్‌ అందిస్తూనే వైద్యసేవలందించారు. అనంతరం రెండు రోజులకు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి భవానీ కన్నుమూసింది. పిల్లల కోసం పరితపించిన కూతురు.తల్లి అయిన మురిపెం తీరకుండానే మరణించడంతో ఇరు కుటుంబాలు దుఖఃసాగరంలో మునిగిపోయాయి.

దత్తాత్రేయ సంతాపం.భవానీ మృతి పట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని దత్తన్న కరుణాకర్‌కు పంపించిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇటీవల కరుణాకర్‌ ఇంటికి వచ్చిన సమయంలో భవానీతో జరిపిన సంభాషణ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *