TT Ads

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం జి.కొండూరు గ్రామానికి చెందిన వృద్ధాప్యంలో ఉన్న అంధత్వం కలిగిన ఇద్దరు అక్కచెల్లెళ్ల బాధ ఇది. జి.కొండూరులో గురువారం బాధితులు పుప్పాల కృష్ణవేణి, పుప్పాల విజయభారతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జి.కొండూరు గ్రామకంఠంలో ఆర్.ఎస్.నెంబరు 281లో 176 చదరపు గజాల విస్తీర్ణంలో డోర్ నెంబర్ 3-65, గ్రామ పంచాయతీ అసెస్మెంట్ నెంబరు 465 దాఖలాలోని ఆర్.సి.సి డాబాలో వారు నివాసం ఉంటున్నారు. వీరికి, వారి నివాసం పక్కన ఉండే వారికి సుమారు100 ఏళ్ల నుంచి 6 అడుగుల వెడల్పుతో ఇరు వర్గాలకు దారి ఉండేది. విజయవాడ – తిరువూరు ప్రధాన రహదారి నుంచి 6 అడుగుల దారిలో గుండా వీరు ఇళ్ళలోపలకు వెళ్లేవారు. కానీ వారి ఇంటిపక్కన ఉంటున్న వారు దారిని ఆక్రమించి ఇటీవల నూతనంగా ఇల్లు కట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అంధులు అనే కనికరం లేకుండా తమపై దౌర్జన్యం చేస్తున్నారని వారు తెలిపారు. తాజాగా 6 అడుగుల వెడల్పుగా ఉన్న దారి 2.5 అడుగులు మాత్రమే ఉందని బాధితులు తెలిపారు.

తమలో ఎవరైనా మరణిస్తే కనీసం శవం తీసుకెళ్లటానికి కూడా అవకాశం లేకుండా ఉందని అంధులైన అక్కచెల్లెలు వాపోయారు. కామన్ దారిని ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేస్తున్న వారి పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ హక్కులను రక్షించాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు, తమ సమస్యపై తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు దీనంగా వాపోయారు. ఆరు పదుల వయసు దాటి కాటికి కాలు చాపి రోగాలతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న సమయంలో ఈ సమస్య మరింత బాధిస్తోందని, కనీసం మనస్ఫూర్తిగా భోజనం కూడా చేయలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. తమ మనోవేదనను అధికారులు అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై గౌరవనీయులు రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *