TT Ads

హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాలవర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసి రైతులు నష్టపోయారు. వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా వరిపైరు నేలవాలింది. మామిడికాయలు రాలిపోయాయి. రాష్ట్రంలో గురువారం నుంచి 4 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కర్ణాటకపై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 8.6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ అత్యధికంగా సుజాతనగర్‌(భద్రాద్రి జిల్లా)లో 5.9, ఇల్లెందులో 5, మోమిన్‌పేట్‌(వికారాబాద్‌)లో 5, చెన్నారావుపేట(వరంగల్‌ గ్రామీణ)లో 4, హత్నూర(సంగారెడ్డి)లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం పగలు హన్మకొండలో అత్యధిక ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలుంది. పగటిపూట వేసవిలో ఇంత తక్కువ నమోదు కావడం ఈ నెలలో ఇదే తొలిసారి.

పంట నష్టాలిలా:కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, జమ్మికుంట, శంకరపట్నం మండలాల్లో పలుచోట్ల వరి, మొక్కజొన్న పంటలు వర్షాలకు నేలకొరిగాయి. హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇదే మండలంలోని ధర్మరాజుపల్లిలో ఈదురుగాలులకు తాటిచెట్టు కూలడంతో గాజే రవికి చెందిన పాడి పశువు మృతి చెందింది. అకాల వర్షానికి ఈ మండలంలో సుమారు 3,500 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయినట్లు ఏడీఏ దోమ ఆదిరెడ్డి బుధవారం తెలిపారు.

వనపర్తి జిల్లాలోని మదనాపురం, కొత్తకోట మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మండలంలో వర్షాలకు కొంతమేర పంట నష్టం జరిగింది. కొత్తకోట మండలంలో 224 ఎకరాల్లో వరి ధాన్యం నీట మునిగింది. దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి కొట్టుకొని పోయింది. కొత్తకోటలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని భాజపా, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి రైతులు ధర్నా చేశారు. మదనాపురం మండలం అజ్జగొల్లులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండలంలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.

పరిహారం అందించాలి:అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి కోరారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో వేల ఎకరాల్లో వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *