TT Ads

మగధ సామ్రాజ్యం అన్నది భారతం నాటిది. జరాసంధుడు తెలియని వాడు లేడనుకుంటా. జనమేజయుని తర్వాత కురు వంశానికి ప్రాధాన్యత పోయి మగధ, దేశానికి మొత్తం రాజధాని అయింది. అప్పటి నుంచి విక్రమార్కుని వరకూ మగధ సింహాసనాన్నెక్కినవాడే చక్రవర్తి. జరాసంధుని వంశం వారు జనమేజయుని తర్వాత ప్రాభవంలోకి వచ్చి చక్రవర్తులయ్యారు. జరాసంధుని కొడుకు భగదత్తుడు. ఇతడు భారతయుద్ధంలో మరణించాడు. ఆయన కొడుకు సహదేవుడు. ఆయన కొడుకు సోమాధి.ఇలా వరుస.ఇది బార్హద్రథ వంశం..వారిలో చివరివాడైన రిపుంజయుని వధించి అతని మంత్రికొడుకు ప్రద్యోతుడు చక్రవర్తి అయ్యాడు. ఈ ప్రద్యోతుని కుమార్తె పద్మావతే “స్వప్న వాసవదత్త”, నాయకుడు, విధ్యాధరాధిపతి అయిన ఉదయన మహారాజు రెండవభార్య.(ఉదయనుడు జనయమేజయుని సంతతి, హస్తిన పాలకుడు). అలా ప్రద్యోతవంశం మొదలైంది. వారిలో చివరి వాడైన నందివర్ధనుని సంహరించి కాశీరాజైన శిశునాగుడు మగధ సింహాసనాన్నెక్కాడు. అది శిశునాగవంశం. అప్పటి వరకూ క్షత్రియులే పాలకులు. వీరిలో ఐదవవాడైన బింబిసారుడు( ఈ బింబిసారుడు,మౌర్య చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడు ఒకరే అని చెప్పి మధ్యన ఉన్న వందలయేండ్ల మన చరిత్రని మింగేశారు.) గౌతమబుద్ధుని సమకాలీనుడు. అతని కొడుకు అజాతశత్రువు కాలంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. శిశునాగులలో చివరివాడు మహానంది. ఇతనికి శూద్రకాంతయందు జన్మించినవాడు నందుడు. ఇతనినే మహాపద్మనందుడనీ అంటారు.

ఈ నందుడు రాక్షస మంత్రి సహాయంతో తండ్రిని ఎదిరించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆయనకు ఎనిమిది మంది క్షత్రియకాంతలు భార్యలు. వీరి ఎనిమిదిమంది పుత్రులనీ, మహా పద్మనందుణ్ణీ కలిపి నవనందులంటారు. వీరిలో పెద్దవాడైన సుమాల్యుడు, చాణక్యుడని పిలవబడే విష్ణుగుప్తుడనే బ్రాహ్మణ్ణి అవమానిస్తారు. ఆ చాణక్యుడు నవనందుల్ని నిర్మూలిస్తానని శపథం చేస్తాడు. మహాపద్మ నందుడికి “ముర” అనే శూద్రకాంత మరొక భార్య. ఆమె కొడుకే మౌర్య చంద్రగుప్తుడు. చాణక్యుడు ఈ చంద్రగుప్తుణ్ణి దగ్గరకుతీసి, నవనందుల్నీ తన కుటిలనీతితో సంహరించి(అందుకే ఆయనకి కౌటిల్యుడని పేరు), చంద్రగుప్తుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాడు. అంటే మౌర్యులు శూద్రులు. ఆ మౌర్య చంద్రగుప్తుని కొడుకే బింబిసారుడు. ఇతడు బౌద్ధమతానుయాయి. ఇతని కొడుకే అశోకుడు, బౌద్ధానికి విస్తృత ప్రచారాన్ని కల్పించినవాడు. ఈ మౌర్యులలో చివరివాడైన బృహద్రథుని సంహరించి అతని సేనాని, బ్రాహ్మణుడు అయిన పుష్యమిత్రుడు రాజైనాడు. ఆయన తరువాత అశ్వమేధయాగం చేశాడు. ధర్మరాజు తర్వాత అశ్వమేధం చేసిన చక్రవర్తి ఇతనే.ఈయన కొడుకే అగ్నిమిత్రుడు, కాళిదాసు” మాళవికాగ్నిమిత్ర” కథానాయకుడు.

పుష్యమిత్రవంశంలో చివరివాడైన దేవభూతిని సంహరించి ఆయన సేనాని కాణ్వాయనుడైన వాసుదేవుడు చక్రవర్తి అయ్యాడు. వీరూ బ్రాహ్మణులే. కాణ్వాయనులలో చివరివాడైన సుశర్మని వధించి ఆంధ్రుడు, శాతవాహన వంశస్థుడు, బ్రాహ్మణుడు ఐన శ్రీముఖ శాతకర్ణి మగధ సింహాసనాన్నెక్కాడు. ఆంధ్రులు అప్రతిహతంగా వందలయేళ్ళు మగధని ఏలారు.బౌద్ధాన్ని పెంచి పోషించారు.ప్రసిద్ధుడైన గౌతమీ పుత్ర శాతకర్ణి ఈ వంశంలో వాడే. వాళ్ళు మన ఆంధ్ర ప్రాకృతాన్ని రాజభాషగా చేశారు.వీరిలో చివరివాడైన చంద్రశ్రీని వధించి గుప్తచంద్రగుప్తుడు రాజయ్యాడు.వీరు క్షత్రియులు. అలెగ్జాండరు భారతదేశంలోకి దండెత్తాడనే పుకారు పుట్టించింది ఈయన కాలంలోనే. ఆ అలెగ్జాండరు కనీసం సింధూనది పరిసరాల్లోకి కూడా రాలేదు. ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఈ గుప్తచంద్రగుప్తుణ్ణీ, మౌర్య చంద్రగుప్తుణ్ణీ ఒకరే అని మధ్యలో ఉన్న మన చరిత్రనంతా మింగి పారేశారు. ఈ గుప్తచంద్రగుప్తుడి కొడుకే ప్రసిద్ధుడైన సముద్రగుప్తుడు. ఇతడు సెల్యూకస్ అనే అలెగ్జాండరు సేనాని కుమార్తె “హెలీనా” ను పెళ్ళాడి గ్రీకులకు పెద్ద ఉద్యోగాలిచ్చి ఇక్కడ మళ్ళా పాశ్చాత్యుల విజృంభణకి తావిచ్చాడు. తరువాత కొన్ని వందలయేళ్ళకు మాళవాధిపతియైన విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిగా, సమస్త భారతావనినీ జయించి చక్రవర్తి అయ్యి శకకర్త గా వేదధర్మాన్ని స్థాపించాడు. కాళిదాస,వరాహమిహిరాదులు ఇతని ఆస్థానంలో నవరత్నాలు. ఆయన మనుమడు శాలివాహనుడు, మళ్ళా చక్రవర్తి అయ్యి శకకర్త అయ్యాడు. మనం ఇప్పుడు ఆ శాలివాహన శకం ౧౯౩౩లో ఉన్నాం.అదీ కలియుగాది భారతదేశ చరిత్ర.

అలా భారతదేశంలో వేదధర్మం లుప్తమవుతున్నపుడు బ్రాహ్మణులు ఆ ధర్మాన్ని నిలబెట్టారు. క్షత్రియుల్లో సరైనవాడు లేనప్పుడు తామే చక్రవర్తులయ్యి వేదధర్మాన్ని రక్షించారు. వారి బ్రాహ్మణ ధర్మాన్ని పాటించారు. ఎవడో పనికిమాలిన పాశ్చాత్యుడు ఈ ధర్మాన్ని చెడగొట్టాలని మనలో మనకు తగాదాలు పెట్టి, అకారణ బ్రాహ్మణ ద్వేషాన్ని రెచ్చగొట్టాలని వాళ్ళకు నచ్చినట్టు చరిత్రని మారిస్తే అదే నిజమనుకుని మనలోమనం కుమ్ములాడుకుంటున్నాం. ఆ విషయంలో వాళ్ళు చాలా వఱకు సఫలీకృతులయినా, ఈ ధర్మాన్ని కూకటివేళ్ళతో ఎవరూ పెళ్ళగించలేరు. ఇది నిత్యం. పరమాత్మ స్వరూపం. అప్పుడప్పుడూ నివురుగప్పి నిప్పులా ఉన్నా ఎవరో ఒక మహానుభావుడు రాకపోడు, ఆ నివురుని ఊది, తిరిగి వేదాగ్నిని ప్రజ్వరిల్లజేయకపోడు. మనలాంటివాళ్ళం ఆ యజ్ఞంలో సమిధలుగా, ఆయన నిశ్వాసానికి తోడుగాలిగా కాకపోము…

జై భారతీ!

కౌటిల్య.

తు.చ.; ఎవరికైనా పై చరిత్ర విషయంలో అనుమానాలుంటే ప్రతి రాజు పాలనాకాలంతో, సంవత్సరాలతో సహా చెప్పగలను. ఆధార సహితంగా కావాలనుకున్నవాళ్ళు శ్రీ కోటవెంకటాచలం గారి గ్రంథాలు చదవగలరు.

అభిరుచి గల సన్మిత్రులు డాక్టర్ శ్రీ కౌటిల్య చౌదరి గారి అపురూపమైన టపా

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *