TT Ads

ద్రాక్షారామం దూళ్ళసంతలో కొన్న సూడిగేదితో పాటు బరువుగా అడుగులేస్తా దాన్ని తోలుకుంటా మా వూరి వేపొస్తున్నాడా దెయ్యాల ధర్మారెడ్డి.రాజుగారి హాల్లోకి కొత్తగా వచ్చిన పెత్తందార్లు సినేమా గురించి తెగ చెప్పుకుంటా పోతున్నాడా ఎనౌన్స్ మెంటు బండి కొండగాడు. స్టూడెంట్సు వీఎస్సెమ్ కాలేజీ లోకి నడిచీ,సైకిళ్ళమీదా తెగెళ్ళి పోతుంటే ప్రిన్సిపాలు గణేశ్వర్రావు గారు మట్టుకు సూటేసుకుని వెళ్తన్నారా రిక్షా లో.పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాపులో అద్దికి తీసుకున్న ఆ పొట్టిసైకిలెక్కి చాలా జోరుగా తొక్కుకుంటా వస్తున్న నేను, దారికి ఎడం పక్కనే కొత్తగా పెట్టిన మాచారం శ్రీహరిగారి పెట్రోలు బంకు దాటు తుండగా ముక్కుకేదో సువాసన తగలడంతో సడన్ బ్రేకేసి దిగి పోయేను.

ఎక్కడ్నించొస్తుందా ఆ సువాసన అని చూస్తే నా పక్కనించే వెళ్తన్న ఆ ఇద్దరు ఆడాళ్ళ బట్టల్లోంచని తేలింది.
పొట్టి సైకిలు నడిపించు కుంటా వాళ్ళెనకాలే వెళ్తున్న నా ముక్కుకి ఆ వాసన తగుల్తానే వుంది.ఇంతకు ముందెప్పుడూ ఎరగని వాసన అసలు పుట్టేకా నేనెరగని సువాసన.అప్పట్నించి, ఆరాత్రి నిద్రపోయేదాకా ఆలోచిస్తానే వున్నానా సువాసన గురించి.కలత నిద్దట్లో కలలు. ఆటి నిండా ఆ సువాసనలే.

తెల్లారేకా గబగబా తయారై పోయి సైకిలు మీద ఆ శ్రీహరిగారి పెట్రోలు బంకు దగ్గర కాపు గాసేను.
పావుగంటైంది,అరగంటైంది,గంటైంది.నిన్నటి టైమైంది.చూస్తే గులాబీ రంగు ఆర్గండీ చీరలు కట్టుకునొస్తున్నా ఇద్దరు ఆడోళ్ళూ నా పక్కనించే వెళ్తుంటే అదే సువాసన.గాలి ఎగబీల్చి వదుల్తున్నాను .ఎంత బావుందీ వాసన.
సన్నగా, పొడుగ్గా ఉన్న వాళ్ళచేతుల్లో వున్న పుస్తకాల్ని బట్టి ఇదే కాలేజీలో చదూకుంటున్నారని అర్థమైంది.దాంతో రోజూ ఇదే చోటు కొచ్చి కాపలా కాస్తున్న నన్ను చూసిన వాళ్ళిద్దర్లో పెద్దామె విసురుగా నాదగ్గర కొచ్చి” చూస్తే చిన్న కుర్రోళ్లాగున్నావు రోజూ ఇక్కడ నిలబడి ఏంటిదీ?” అంటా కేకలేయటం మొదలెట్టింది.

మొత్తం భరించేకా చిట్టచివర్లో నోరు విప్పిన నేను ” రోజూ ఇక్కడ నిలబడ్తుంది మీ బట్టల్లోంచొచ్చే ఆ సువాసన కోసం అక్కయ్యా ,”అనేటప్పటికి నోరెళ్ళబెట్టి నాళ్లిద్దరూ చాలా మంచి ఫ్రెండ్సయి పోయేరా వేళ్టినించీ.
ఆ పెద్దామె విజయలక్ష్మి,పక్కనే వున్న ఆ చెల్లెలు శారద రోజూ వాళ్ళు బట్టలకి రాసుకునేది పిఠాపురం లో తయారయ్యే నూర్జహాన్ సెంటు.

డబ్బులు పోగేసుకుని తొందర్లోనే పిఠాపురవెళ్ళి ఆ నూర్జహాన్ సెంటు సీసా కాయి కొని తెచ్చేసు కుందారను కుంటన్నాను గానీ ఎప్పటి కప్పుడు ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఇబ్బంది.ఆ వేళ పొద్దుట మా ఇంటి ముందున్న ఎర్ర కంకర దారమ్మట నడుచుకుంటా వెళ్తున్న సత్తోరి సత్యనాణరెడ్డి రాసుకున్న అత్తరు వాసన ఆ దారంతా ఆవరించుకుపోడంతో నూతి దగ్గర నీళ్ళు తోడు కుంటున్న ఆడోళ్ళంతా మాగొప్పగా మాటాడేసు కుంటున్నారా సువాసన గురించి.వింటున్న నాకు ఆ నూర్జహాన్ సెంటు ముందు ఈవాసనేమూలకీ పనికి రాదని పించడమే గాకుండా ఆ ఆడోళ్ళ మీద కోపం కూడా వచ్చేసింది.

ఆవేళ సాయంత్రమప్పుడు మా వూరి లాకుల మధ్యున్న మొండి మీద కల తిరుగుతున్న నా ముక్కుకి సెంటు వాసన తగలడంతో తలెత్తి చూసేను.దిగువలో వున్న కాకివారి సావరం శివార్లో ఉండే యండమూరి క్రిష్ణవేణిగారు ఉప్పాడ కలనేత చీర కట్టునెళ్ళిపోతుంటే ఆవిడ గారి దగ్గర్నించొస్తుందా వాసన. బావుంది.కానీ,నేనంతగా ఇష్టపడ్తున్న నూర్జహాన్ సెంటు ముందెందుకూ పనికి రాదా క్రిష్ణవేణి రాసుకున్న అత్తరు వాసన.

ఆ మార్చినెల తర్వాత మెడ్రాసెళ్ళి పోయిన నేను, నలుగురు కుర్రోళ్ళతో కల్సి ఆ మద్రాస్ ,ట్రస్ట్ పురం థర్డ్ క్రాస్ స్ట్రీట్ లోవున్న సిరిసిరిమువ్వ సినిమా ఆఫీస్ వెనకాల ఔట్ హౌస్ లోఉంటున్నాను. మా రూమ్మేట్స్ లో ఒకడైన రాజశేఖర్ సినిమాల్లో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. రాత్రుళ్ళు నిద్రపోకండా సిగరెట్లు కాలుస్తా ఇంగ్లీష్ నవలలు చదూతున్నాడు.ఆ వేళ రాత్రి ఒంటి గంట దాటినా నిద్రపట్టక చాప మీద దొర్లుతున్న నాతో “ ఆర్కాట్ రోడ్లో ఇరానీ చాయ్ దొరికే హాలీవుడ్ హొటల్ కెళ్దామా?”అన్నాడు.“ సరే” అంటా లేచి బయల్దేరేను అతని వెనకాల.ఆ వీధి చివర్లో వున్న కొడవటిగంటి కుటుంబ రావు గారింటి కుడిపక్కకి తిరిగి కొంత దూరం నడిస్తే వచ్చే ఆ ఆర్కాట్ రోడ్ వేపెళ్తన్నాం.అలాగ కొంత దూరం వెళ్లేకా స్టోన్ వాష్ పేంటూ,టీ షర్టూ వేసుకున్న ఒక ఆడమనిషి మమ్మల్ని క్రాస్ చేసుకుంటా వెళ్తుంటే ఏదో సెంట్ వాసన ఆ మనిషి దగ్గర్నించి.ఆ మనిషిని చూస్తా నావేపు తిరిగిన శేఖర్ “మౌంట్ రోడ్లో ఉన్న ఒక క్లబ్ లో కేబరే డేన్సర్ తను . ఆ మనిషి రాసుకున్న ఆ సెంట్ పేరు ఇంటెన్స్ జాస్మిన్బాగుంది.కదా?”అన్నాడు

పిఠాపురం నూర్జహాన్ సెంటంత బాగోలేదు.”అన్నాను.“ అంత బాగుంటుందా ఆ నూర్జహాన్ సెంటు?”
“ చాలా….నాకు” అన్నాను.ఇంకొంచెం ముందు కెళ్ళేకా వచ్చిన ఆ హాలీవుడ్ హొటల్లోపలి కెళ్ళి టీ ఆర్డర్ చేసిన అర నిమిషం తర్వాత ఎవరో లోపలికి రావడంతో జనాల్లో సందడే సందడి. చూస్తే రజనీకాంత్.అందరి కేసీ నవ్వుతా చూస్తా మా పక్క నించెళ్తుంటే అతను స్ప్రే చేసుకున్న పెర్ ఫ్యూమ్ వాసన నా ముక్కుకి తగిలింది.టీ తాగి బయటి కొస్తుంటే “ఆ రజనీ రాసుకున్న పెర్ ఫ్యూమ్ పేరు తెల్సా?” అన్నాడు శేఖర్.
“ తెలీదు.” అన్నాను.“ క్రోమ్ లెజెండ్ఎలాగుందీ?నూర్జహాన్ సెంటే బాగుందా?. ” అంటా సిగరెట్ వెలిగించు కున్న ఆరాజశేఖర్” రైటర్ పేట్రిక్ సుష్కింద్ రాసిన పెర్ ఫ్యూమ్ అనే నవల చదివేను.అందులో హీరో లక్షణాలు కొన్ని నీకున్నాయి.”“ ఏంటయ్యీ?”
“పరిమళం అనేది ఎక్కడున్నా ఇట్టే పసిగట్టేసి అదెలాగుందో లెక్కలు గట్టేస్తావు.”“ మీరు చెప్పిన నవలలో హీరో కూడా నాలాగేనా?”“వాసన రెండు కిలోమీటర్ల దూరంలో వున్నా పసిగట్టేసి పరిగెడ్తాడాడు”“ ఔనా!! మరదీ కేరెక్టరంటే నేనతన్లా కాదు గదా?.”అలా ఆ పెర్ ఫ్యూమ్ హీరో గురించి మాటాడు కుంటా ఆ ట్రస్ట్ పురం వీధుల్లో కల తిరుగుతా వుంటే తెల్లారి పోయింది.

సినిమాల్లో పని చేస్తానే కధలు రాసే ప్రయత్నాలు చేస్తున్న నేను , పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఎడిటర్ గా చేస్తున్న ఆంధ్రజ్యోతికి “శీలం పోయింది వెతకండి”అన్న పేరు పెట్టి, చెడి పోయిన ఒక అతి మంచోడి కధ రాసి పంపేకా, పని మీద విజయవాడ వెళ్ళి నప్పుడు ఆ పత్రిక ఆఫీసు కెళ్తే, నవ్వుతా నన్ను పలకరించిన శర్మగారు “కథేగాదు రాసిన కాయితాల్నిండా కూడా ఆ సెంటు వాసనే సుమా!” అంటా ఆశీర్వదించేటప్పటికి ఒకటే ఆనందం నాకు.

ఆళ్వార్ పేట జంక్షన్లో బస్ దిగి, ఆనంద్ హొటల్ అవతల పేవ్ మెంట్ మీంచి నడుచు కుంటా వెళ్తుంటే తెల్లటి చెవర్లెట్ కారులో కూర్చుని తెల్లటి పట్టుచీరలో అందంగా తయారై వెళ్తున్న వైజయంతి మాల కనిపించే టప్పటికి ఆవిడే రకం సెంటు రాసుకుందో ?అనిపించింది.అసలేం రాసుకో పోయినా మాగొప్పగా గుభాళించే అందం ఆ మధుమతిది. ఆవిడ గారు ఆ కారడివిలో ”ఆజారే పరదేశీ” అంటా పాడుతుంటే ఎన్ని రకాల పరిమళాలు పూచాయనీ ఆమె లోంచీ !!!చాలు చాలు ఇంకా ఎందుకా శరీరం మీద మళ్ళీ పరిమళం పూత?

వేషాలకనీ,ఇంకా ప్రొడక్షనూ,డైరెక్షన్ డిపార్ట్ మెంట్లలో పనుల కనీ వచ్చిన జనాలు పల్చగా నిలబడున్నారా ఇంటి ముందు.ఇంకా మేడమీంచి దిగలేదు డైరెక్టర్ గారు.
కర్ర్ ర్ర్ మంటా చప్పుడొస్తన్న ఆ ఇనప గేటు తోసుకుని లోపలి కెళ్ళబోతుంటే జాయ్ మంటా వచ్చాగింది లేత నీలం ఫియట్ కారు.అందు లోంచి దిగిన కాంచన గారు ఠకఠక మనే చెప్పుల చప్పుడుతో నన్ను క్రాస్ చేసు కుంటా లోపలి కెళ్తుంటే ఆమె స్ప్రే చేసుకున్న ఫారిన్ పెర్ ఫ్యూమ్ వాసన ఆ ఏరియా అంతా పాకి పోతుంది.
ఆ వాసన పీలుస్తా ఆలోచిస్తుంటే మళ్ళీ ఠకఠకా చప్పుళ్ళు. నా దగ్గర కొచ్చినా కాంచనగారు” డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో అప్రంటీస్ గా చేరింది నువ్వేనా?”అన్నారు.
“ ఔను మేడమ్”“ పాండీ బజార్లో ఉన్న రాణీ బుక్ సెంటర్ లో కెళ్ళి ఆస్కార్ వైల్డ్ డోరియన్ గ్రే,మా బీడిక్ నవలలూ పట్రా బాబూ” అంటా డబ్బులిచ్చేరు.
“ సరే మేడమ్ గారూ” అంటా కదుల్తుంటే “ఇదిగో అబ్బాయ్ బయటున్న నా కార్లో వెళ్ళి తొరగా రా”
“అలాగే నండీ” అంటా ఆ నీలం ఫియెట్ కారెక్కేనో లేదో ఇప్పుడే ఆమెగారు దిగిన ఆ కారు నిండా ఆ ఫారిన్ పెర్ ఫ్యూమ్ వాసన. దీన్నీ నూర్జహాన్నీ పోల్చుకుంటా నా ఆలోచన్లు.

మన్యం నారాయణరావు హొటేల్నిండా జనాలే జనాలు,అద్దంకోరి కిళ్లీ కొట్టు దగ్గరా,మీరాసాహెబ్ దర్గా దగ్గరా,దూలిపూడి సీతారావయ్య కిళ్లీకొట్టు దగ్గరా జన్మలో ఎప్పుడూ ఎరగనంత మంది జనం.వందలా వేలా పదివేలా.లక్ష్మా అసలేంటా జనం?తను పుట్టేకా అంత మంది జనాన్ని ఎప్పుడు చూసిందా యానాం రేవు???.
కొత్త సినిమా ఎదురీత షూటింగ్ ఈ రేవులో మొదలవ్వ బోతుంది. ఇప్పడో ఇంకాస్సేపట్లోనో ఎన్టీవోడు దిగబోతున్నాడు.అందుకే ఈ జనాలు. అందుకే ఈ అరుపులు. అందుకే ఈ సందడి.
తెల్లకారొకటి రేవులో ఆగుతుంటే మొదలై పోయిన అరుపులూ కేకలూ అలాగిలా లేవు.
నెమ్మదిగా ఆగిన కారు దగ్గరకి గబగబా పరుగెట్టు కుంటా వెళ్ళినా కుర్రోడు డోరు తెరిచేటప్పటికి చాలా వయ్యారంగా దిగిన ఆ మనిషి ఎన్టీవోడు కాదు.
“వాణిశ్రీరా వాణిశ్రీ వాణిశ్రీ రోయ్ వాణిశ్రీ. “చాలా నాజూగ్గా దిగుతున్న నాణ్యమైన ఆ వాణిశ్రీ శరీరం లోంచొస్తున్న మాగొప్ప పరిమళాలని చాలా దగ్గర్లోనే ఉన్న నేను పీలుస్తున్నాను అలా పీలుస్తా తల్చుకుంటున్నాను..ఆలోచించు కుంటా పోల్చుకుంటున్నాను.

అసిస్టెంట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా ఎదురీత ఐతే ఆఖరి సినిమా సీతాకోకచిలుక.తర్వాత మంచుపల్లకీ సినిమాతో డైరెక్టరయిన నేను ఆ నూర్జహాన్ సెంట్ తెప్పిద్దామనీ అలా కాదులే ఆ పిఠాపురం మనమే వెళదామనీ చాలా సార్లను కున్నాను.వెళ్ళలేక పోయేను.ఆ ఊరి మధ్యలోంచెళ్తా కూడా ఆ నూర్జహాన్ కంపెనీ ముందాగ లేక పోయేను.ఇలా నాకే గాదు చాలా మందికి చాలా విషయాల్లో జరుగుతుంటుంది.
కానీ,
నేను రాస్తున్న కథల్లోనూ తీస్తున్న సినిమాల్లోనూ నూర్జహాన్ సెంట్ టాపిక్ తీసుకొస్తానే ఉన్నాను.
చాలా ఏళ్ళు గడిచి పోయినియ్యి.కుర్రతనం పోయిన నాకు చాలా ఏళ్ళు వచ్చేసినియ్యి.
మొన్న మార్చిలో అన్నవరం వెళ్తన్నప్పుడల్లా వింటా వస్తున్న ఆ శాంతి ఆశ్రమానికెళ్ళేను.
అక్కడున్నాడు. ఆనాటి మిత్రుడు వీరెడ్డి.
అతనూ నేనూ,తెల్లవారు ఝాములప్పుడు, ఇంకా పూర్తిగా పాడవ్వని ఆ శాంతిఆశ్రమం చుట్టు పక్కల పల్లెటూళ్ళ వీథుల్లో మోర్నింగ్ వాక్ కెళ్ళొస్తా చాలా విషయాల గురించి చర్చించు కుంటున్నాం.
ఆవేళ మా మాటల్లో ”ఈ మూల కొండల దిగువ లో ఉంటున్న మాకు చిన్నచిన్న పన్లు బడితే పన్నిండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్తిపూడి వెళ్తాం.కొంచెం పెద్దపన్లైతే దూరంగా వున్న పిఠాపురం వెళతాం” అన్నాడు వీరెడ్డిగారు.
చాలా చరిత్రున్న ఆ పిఠాపురం గురించి చాలా మాటాడు కున్నాకా నూర్జహాన్ సెంట్ గురించి ఎత్తితే“ పరిమళ ద్రవ్యాలు నేను వాడన్లెండి…..మీమాటలు జూస్తుంటే వాటి మీద మీకు చాలా మోజుందను కుంటున్నాను.”అన్నాడు.
ఆ సెంటు మీద నా చిన్నప్పట్నించీ జరిగిన కధలు చెపితే“ ఔనా వాళ్ళతాలూకు మనిషొకాయన ఇక్కడ ఉండాలండీ!ఐనా ఆ పిఠాపురంలో నాకు తెల్సినోళ్లు బానే వున్నార్లే” అన్నాడో లేదో మర్నాడు సాయంత్రం కొంత మంది జనాలు దిగేరు నేనుంటున్న ఆ కాటేజ్ లోకి.నన్ను వాళ్ళకి పరిచయం చెయ్యబోయిన వీరెడ్డితో “మాకీయన గురించి తెల్సు” అన్నాడొకాయన.
తలెత్తి అతన్ని జూస్తే ,ఆ నూర్జహాన్ కంపెనీకి ఈ తరం యజమానంట.
ఆ సెంటు గురించి చిన్నప్పట్నించీ నా కథలు చెపితే “కొన్ని నాకు తెల్సు ”అన్నాకా మాటలు మొదలైనియ్యి.
అలా కాసేపయ్యేకా “మరైతే ఎప్పడొస్తారూ మన ఇండస్ట్రీకీ?”అన్నారు.
ఈ శాంతి ఆశ్రమం లో నా ప్రోగ్రాం చెప్పేను.
“చూస్తుంటే సడెన్ గా మీ షెడ్యూలు మారి జంపై పోతారేమో అనిపిస్తుంది రేపొచ్చెయ్య గూడదూ” అన్నారు.
నేనూ వీరెడ్డిగారూ కల్సిమాటాడు కున్నాకా వాళ్ళవేపు తిరిగి“ రేపు సాయంత్రం
ఐదు గంటల కల్లా మీ దగ్గరుంటాం” అన్నాను.
“ఆ టైముకి కాచుక్కూచుంటాం మీ కోసం” అనేసి ఆళ్లెళ్ళి పోయేరాళ్లు.

ఏనాటి  నూర్జహాను సెంటూ అది తయారయ్యే చోటికి ఇన్నేళ్ళ తర్వాతెళ్తన్నానా! అనుకుంటుండగా గొల్లప్రోలు ఎప్పుడో దాటేసిన మా కారు పిఠాపురం ఊళ్ళో కొచ్చేసి ఆర్టీసీ కాంప్లెక్స్‌‌ ఎదురుగుండా వున్న ఆ పింక్ కలర్ బిల్డింగ్ ముందాగింది.

“మీరు చెప్పిన నూర్జహాన్ సెంట్ల కంపెనీ ఇదే సారూ” అన్నాడా డ్రైవర్ సత్తిబాబు.
ఆ బిల్డింగ్‌‌ నే చూస్తా ఇనపగేటు దాటి లోపలికెళ్తుంటే ఎదురొచ్చిన దాని ఓనర్ గారు “రండ్రండి మీరు రారనుకున్నాను” అన్నారు.
లోపలి కొచ్చిన నేను నిలబడి నాలుగుపక్కలా చూస్తుంటే “వర్క్‌‌షాపు, లేబ్‌‌ లోపలున్నాయి అంటా అంతా చూపించేకా “ఎలా గుంది మా కంపెనీ?” అన్నారు.
“నేను ఊహించుకున్నట్టు లేదు” అన్నాను.
వాడపల్లి పెంకుల్తో నేసిన మండువా లోగిలిలాంటి ఒక మేడ ఫొటో చూపించి “మా కంపెనీ మొదటి బిల్డింగ్ ఇది” అన్నారు.
దాన్నే ఆత్రంగా చూసిన నేను“ ఇదీ నా ఊహల్లో వున్న మీ కంపెనీ” అన్నాను.
నవ్వేసినాయన “ ఆరోజల్లో కోట గుమ్మం సెంటర్లో వుండేది” అన్నారు.
నూర్జహాన్ సెంట్ వాసన నా జీవితంలో ఒకే సారి చూసి, అలా ఇన్ ఫ్లుయెన్స్ అయిన సంగతి ఆయన్తో చెప్పి,అలా ఎందుకయ్యేనోచర్చిద్దాం అనుకునే లోపల మా మథ్యలో కొచ్చేసిన వీరెడ్డిగారు“నూర్జహాన్ అంటే ముస్లిమ్స్‌‌ది అనుకున్నాను” అన్నాడు.

“అంతా అదే అనుకుంటారు కానీ మేం కాదు. మా నాన్న గారి పేరు దేవరపల్లి సత్యనారాయణరావు. నా పేరు శ్రీనివాస రావు. 1944లో ఈ కంపెనీ పెట్టేరాయన.
రకరకాల బ్రాండ్ నేమ్స్‌‌తో ఎక్కడికక్కడ పేర్చి వున్న ఆ సెంట్‌‌ సీసాల్ని వాటిని పేర్చే అట్ట పెట్టెల్నీ చూస్తున్న వీరెడ్డికి తాళ మేసున్న ఒక గది కనిపించడంతో“అదేంటీ?” అన్నాడు.
“ల్యాబ్…. సెంట్ ఫార్ములా తయారు చేసే ఆ ప్లేస్‌‌కి మా ఇంట్లో వాళ్ళు తప్ప బయటి వాళ్ళని ఎలవ్ చెయ్యం.”
“రామచంద్రపురంలో ఆర్టోస్ కూల్‌‌ డ్రింక్ ఫార్ములా కూడా ఇంతే బయటి వాళ్ళని లేబ్‌‌లోకి రానియ్యరు…సరే ,ఈ సెంట్ తయారు చెయ్యాలన్న ఆలోచన మీ నాన్నగారికెలా వచ్చింది?” అడిగేడు వీరెడ్డిగారు.
“మంచి పెర్ఫ్యూం తయారవ్వాలంటే అది చేసే వాడికి మంచి ముక్కు ఉండాలి” అనా శ్రీనివాసరావుగారంటుంటే పెర్‌‌ఫ్యూమ్‌‌ సినిమాలో హీరో గుర్తొచ్చేడు మళ్ళీ.
“ఈ పిఠాపురంలో వుండే మనిషైన మీ నాన్నగారికి ఈ పెర్ఫ్యూం తయారు చెయ్యాలన్న ఆలోచన ఎలా గొచ్చిందో చెప్పండి ముందు.”మళ్ళీ అడిగేడు వీరెడ్డిగారు.
“చిన్నప్పట్నించీ పరిమళ ద్రవ్యాల్ని బాగా ఇష్టపడేవారు మా ఫాదర్. మా ఇంట్లో ఉన్న ఒక సెంట్ బాటిల్ని బేంబూ బాటిల్ అని పిల్చేవాళ్ళంట. దాని బిరడా మీద గుండు సూదితో గుచ్చి తీసి ఆ సూది కి అంటు కున్న సెంటుని చొక్కాకి రాసుకుని బయటికెళ్ళే మా ఫాదర్‌‌కి సపరేట్ రికగ్నైజేషన్ ఊళ్ళో.
ఇదే సెంటు మన పిఠాపురంలో మనం ఎందుకు తయారు చెయ్యకూడదు అన్న ఆలోచనొచ్చిందాయనకి.
ఎంక్వైరీ చేస్తే బాంబే వెళ్ళి కొన్నాళ్ళు స్టడీ చేసి రావాలి దానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది అని తేలింది.
చాలా పంతం పట్టుదల గలాయన, తన వాటా కొచ్చిన మూడెకరాలూ అమ్మేసి బాంబే వెళ్ళి అనుకున్నది సాధించు కొస్తున్నప్పుడు దారిలో, ఫరీక్ అనే రాజస్థాన్‌‌కి సంబంధించిన పెర్‌‌ఫ్యూం సప్లయర్ పరిచయమైతే ఆయన్ని కూడా వెంటబెట్టుకొచ్చేరు.
వారం రోజుల పాటు ఈ పిఠాపురంలో వున్న ఫరీక్ ,సెంట్స్‌‌ తయారు చెయ్యడంలో కొన్ని మెళుకువలు మా నాన్నగారికి నేర్పి వెళ్ళిపోయేడు.
మా ఇంట్లోనే కంపెనీ పెట్టి తయారు చెయ్యడం మొదలెట్టిన మా నాన్నగారు చాలా సక్సెస్‌‌ఫుల్‌‌గా మొదటి సెంట్‌‌బాటిల్ బయటికి తెచ్చి దానికి పేరేం పెట్టాలా అని ఆలోచిస్తుంటే తనెక్కడో చదివింది గుర్తొచ్చింది.
“ఏంటీ?” అన్నాడు వీరెడ్డి.
“నూర్జహాన్ బేగం రకరకాల పెర్‌‌ఫ్యూమ్స్‌‌ వాడేదని దాంతో ఆవిడ పేరే కంపెనీకి పెట్టేసేరు.
“ఔనా!!! చాలా బాగుందండీ” అన్నాడు వీరెడ్డి.
“మన ఆంధ్రాలోనే గాకుండా అటు తమిళనాడూ ఇటు ఒరిస్సా ఇంకా చాలా రాష్ట్రాల్లో పాపులరైంది నూర్జహాన్ సెంట్.”
“మీ సెంట్‌‌ని పిఠాపురం రాజావారు వాడేరా?”
“మా రాజా సూర్యారావు బహద్దూర్‌‌, వినోబాబావే, మైసూర్ మహారాజా ఫేమిలీ మొత్తం, రతన్‌‌ టాటా ఇలా చాలా మంది పెద్దవాళ్ళు వాడేరు.”
“సినిమా వాళ్ళు…?”
“జమున , హరనాథ్, రాజసులోచనా, డైరెక్టర్ సి.ఎస్.రావూ వీరంతా మా ఇంటి కొచ్చేవారు… అలాంటి వాల్ళెవరొచ్చినా నూర్జహాన్ సెంట్స్‌‌ కిట్ వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవారు నాన్న.”
“ఆయనెలా కాలం చేసేరు?”
“ఆపరేషన్ చేయడంలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయేరు. దానికి చాలా ఆగ్రహించిన మా పిఠాపురం జనం, ఆ డాక్టర్ని ఊళ్ళోంచి తరిమేసేరు” అంటా ఆయన చెప్పుకుంటా పోతుంటే టైము రాత్రి ఎనిమిది దాటేసింది.
“మీరు చెప్పేది వినడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బయల్దేరి మళ్ళీ వచ్చేస్తాం” అన్నాడు వీరెడ్డిగారు.
ఆ శ్రీనివాసరావు గారి దగ్గర కొచ్చిన నేను“ మీ నూర్జహాన్ సెంటుని వాసన చూసింది ఒకేగురించి చాలా అడగాల్సిందుంది రేపు” అంటా బయల్దేరేను.
ఆ శ్రీనివాసరావుగారి దగ్గర కొచ్చిన నేను, నా జీవితంలో నూర్జహాన్ సెంటుని
వాసన చూసింది ఒకే ఒక్కసారి అని ఇందాక చెప్పేను గదా?”అన్నాను.
“ఔను చెప్పేరు” అన్నాడాయన.
“ఆ పరిమళానికి ఆ వయసులో నేనెందుకంత ఇన్ ఫ్లుయెన్స్ అయ్యేను? అన్న అంశం మీద రేపు డిస్కస్ చేద్దాం సార్”అనేసి బయల్దేరి,కీచ్ మంటా చప్పుడొస్తున్న ఆ ఇనప గేటు లాగి బయటి కొచ్చి ఆగున్న కారులో ఎక్కుతుంటే పరిగెట్టు కుంటా మా వెనకే వచ్చినా శ్రీనివాసరావు గారు “ వంటింట్లో ఫుడ్ రెడీ అవుతుంది మీ కోసం. ముందు చెప్పడం మర్చి పోయినందుకు సారీ అండీ” అన్నారు.
“అయ్యో పర్లేదండీ రేపొస్తాంగా?”
“ మిమ్మల్నిలా పంపితే చాలా గొడవలయి పోతాయి మా ఇంట్లో వాళ్ళతో ప్లీజ్ కారు దిగి పైకి రండి” అంటా డ్రైవరుఆ సత్తిబాబు వేపు చూస్తా “నువ్వు కూడా రా తిందూగాని ” అన్నారు.
మరి తప్పక దిగి అతనెనకాలే వెళ్ళేం.
పైకెక్కుతుంటే చీకట్లో మెట్ల మూల పడుకునున్న సూడికుక్క తోక మీద కాలెయ్యడంతో కయ్ మంటా లేచి మూలుక్కుంటా కింద కెళ్ళి పోయింది.ఆ పైకెళ్ళేకా వంటగదిలోకి పరుగెట్టు కెళ్ళొచ్చిన ఆయన “ఐపోవచ్చింది ఐదు నిమిషాలు రండి లోపల హాల్లో కూచుందాం” అన్నారు.
“బయట బాల్కనీ లో బాగుంది గాలి బాగా వీస్తుంది” అన్నాడు వీరెడ్డి గారు.
అక్కడ లైటేసి, నాలుగు కుర్చీలు పంపించ మని అరుస్తా” రండి” అన్నారా శ్రీనివాసరావు.
“ఈ ఏరియా కెప్పుడొచ్చినా ఆ సీజన్ని బట్టి మీ పిఠాపురం రైల్వేగేటు దగ్గర దొరికే మల్లిపూలూ ,మొక్కజొన్న పొత్తుల్లాంటివి కొంటుంటాను”.
“ఫ్లైఓవర్ కట్టేసేకా ఇప్పుడయ్యేం అమ్మటం లేదక్కడ”
“ ఔను.ఆ గేటే తీసేసేరు.”
మేం మాటాడు కుంటుంటే “ఏవండీ వంటయి పోయింది భోజనాలకి రావచ్చు” అన్న మాటలు వినిపించాయా చీకట్లోంచి.
“ఓసారిలా రా నిన్ను పరిచయం చెయ్యాలి వీరికి..”అనా శ్రీనివాసరావు పిలవగానే, ఆ చీకట్లో మా వేపొస్తున్న కాళ్ళగొలుసు చప్పుళ్ళు బాగా దగ్గరగా వచ్చి మా ముందాగినియ్యి. ఆనాటి నూర్జహాన్ పరిమళం నా నాసాపుటాల్ని తాకింది.
“నా శ్రీమతి“ అంటా ఆవిడ్ని మాకు పరిచయం చేసేరు శ్రీనివాసరావు.
. తలెత్తి ఆవిడ్ని చూసిన నాకు మాట పడి పోయింది మూర్చరాబోతుంది.
ఆవిడ
ఆనాడు నాకీ నూర్జహాన్ సెంటుని పరిచయం చేసిన అక్కాచెల్లెళ్ళు విజయలక్ష్మీ,శారదల్లో ఒకరైన శారద.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *