TT Ads

విశాఖపట్నం:మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలకు మళ్లీ తెరలేచింది. గతేడాది బ్యాలెట్‌ ముద్రణ పూర్తయ్యాక నిలిచిపోయిన ప్రాదేశిక ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ పచ్చజెండా ఊపారు. పంచాయతీ, పురపాలిక ఎన్నికలు ముగిసి పాలకవర్గాలు కొలువుదీరిన కొద్దిరోజులకే ప్రాదేశిక పోరు జరగనుండటంతో గ్రామాల్లో మరోసారి రాజకీయ వేడి రాజుకోనుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంలో దూకనున్నారు.పరిషత్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే 80 శాతం ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తిచేసింది. ఈ నెల 8న పోలింగ్‌, 10న లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాటిపైనా కొద్దిరోజులుగా జిల్లా పరిషత్తు సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 39 జడ్పీటీసీ, 651 ఎంపీటీసీ స్థానాలకు గతేడాది మార్చి 9న నోటిఫికేషన్‌ జారీ అయింది.

జడ్పీటీసీ స్థానాలకు 314 మంది, ఎంపీటీసీ స్థానాలకు 3,330 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 37 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. వీటిలో వైకాపా అభ్యర్థులు 36, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. రోలుగుంట జడ్పీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 38 జడ్పీటీసీ స్థానాల్లో 177 మంది, 614 ఎంపీటీసీ స్థానాల్లో 1,830 మంది బరిలో ఉన్నారు.

పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ ముద్రణ పూర్తయింది. ప్రచారం ఊపందుకునే సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నెల 8న పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఉన్నతాధికారుల ఆరా జిల్లా పరిషత్‌, మండలపరిషత్‌ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్‌ఈసీ నీలంసాహ్ని ఆరా తీశారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, కొవిడ్‌ కేసుల తీవ్రత తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఎస్‌ఈసీతో పాటు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొనగా కలెక్టరేట్‌ నుంచి జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, ఎస్పీ కృష్ణారావు, జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్‌ పాల్గొన్నారు.

గుర్తింపు పార్టీల అభ్యర్థులు చనిపోయిన చోట్ల వాయిదా: ఆనందపురం మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో నిలిచిన తాట్రాజు ఆదినారాయణ గతేడాది అనారోగ్యంతో చనిపోయారు. కె.కోటపాడు మండలం దాలివలస ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు నామినేషన్‌ వేశారు. ఆయనా చనిపోయారు. నక్కపల్లి మండల జానకయ్యపేట ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థి దేవర నాగమణి మరణించారు. ఈ మూడు చోట్ల ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇలాంటి స్థానాలన్నింటికీ కలిపి మరోసారి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. దీంతో జడ్పీటీసీ స్థానాలకు 37 చోట్ల, ఎంపీటీసీ స్థానాలకు 612 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.స్వతంత్రులు చనిపోతే

ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన పార్టీల తరఫున నామినేషన్లు వేసి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన చోటే ఎన్నికలు వాయిదా పడనున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరు మరణించినా అక్కడ యథావిధిగా ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో అరకులోయ జడ్పీటీసీ, జి.మాడుగుల మండలం బీరం ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు గతేడాది చనిపోయారు. ఇక్కడ ఎన్నికలు ఆగే పరిస్థితి లేదు. బ్యాలెట్‌ ఇప్పటికే ముద్రణ జరిగిపోవడంతో వాటిలో వీరికి కేటాయించిన గుర్తులు అలానే ఉంటాయని జడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, జడ్పీ కార్యాలయంలో ఎన్నికల విభాగాన్ని పునరుద్దరించనున్నట్లు చెప్పారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *