TT Ads

మాస్కు దండగంటే మట్టికొట్టుకపోతావని
శానిటైజర్ తో కడుక్కుంటే కొరోనా క్రిమి చనిపోతాదని
భౌతికదూరం పాటిస్తే కొరోనాను పాతరేయచ్చని
వ్యాక్సిన్ తో సమన్యాయం జరుగుతుందని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

మాల్సులు, సినిమా హాలులు, పండగలు, జాతరలు,
ఫంక్షన్లు, పుట్టిన రోజు ఫంక్షన్లు, తద్దినాలు,
సమర్తబంతి ఫంక్షన్లు, పబ్బులు, క్లబ్బులు,
మందుపార్టీలు, కొరోనా వ్యాప్తి కేంద్రాలని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

తుమ్ములొచ్చినా, రుచి తెలియకపోయినా,
దగ్గు దమ్ము వచ్చినా, గుండె వేగంగా కొట్టుకున్నా,
వాసన తెలియకపోయినా, కళ్ళు ఎర్రబడ్డా,
అజీర్ణమయినా కొరోనా ఉంటదని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

గాలి ద్వారా, పిత్తు ద్వారా, శవాల ద్వారా,
నడక ద్వారా, వ్యాయామం ద్వారా, వేడి ఆహారం ద్వారా
ఆవిరి పీల్చడం ద్వారా, విటమిన్లు తినడం ద్వారా,
కొరోనా వ్యాపించదని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

రెమిడిసివీరు, లోపినవీరు, రిట్నోవీరు,
హైడ్రాక్సిక్వినోలిను అన్నీ తుస్సు మందులని
ఆక్సిజన్, హెపారిన్, స్టీరాయిడ్సే ప్రాణాపాయము నుంచి కాపాడే దివ్యఓషధులని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

మనుషులు విపత్కర పరిస్ధితిలో,
ఎవరు బ్రతుకుతారో తెలియనపుడు,
బ్లాక్ మార్కెటింగ్ లాంటి అక్రమ వ్యాపారాలు,
అనవసరవైద్యం అలివికాని రుసుమేయరాదని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

అనవసరమైన పరీక్షలు, రోజు వారి అవే పరీక్షలు,
స్కానింగ్ లు, లక్షల ఫీజులు కూడదని
భయపడించే వైద్యంకాదు, భరోసా వైద్యం కావాలని,
మనిషి ని మనిషిగా ప్రేమించే వైద్యం కావాలని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

కరోనిల్ అన్నా, గోకొరోనా అన్నా, అప్పడాలన్నా,
చెంబుతపాలా కొట్టమన్నా, దీపాలెలిగించమన్నా,
ఓట్లపండగలు జరిపినా, గోమూత్రమన్నా, పేడన్నా,
గంగాస్నానమన్నా మౌనంగా నవ్వులాటకని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

ఆకలో రామచంద్రా అని అరచిన లాక్డౌన్ లు,
జనజీవితం అతలాకుతలం చేసిన కర్ఫ్యూలు
వందల కిలోమీటర్లు నడిచిన దిక్కులేని కూలీలు
అందరి వ్యధలకు సాక్షీ భూతంగా నిలిచామని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

అయినా ఈ విపత్కర పరిస్ధితి నుండి కాపాడతారని
చితికిన బ్రతుకుల చీకటి జీవితాలలో వెలుగులు ప్రసరిస్తారని
యమలీల శవాల కరాళనృత్యహేళ ఆపగలరని
జీనసంజీవని తో నవజీవితం కలిపిస్తారని నీవంటే
నానేటంటను, నీవు ఏటంటే నేనదే అంటను

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *