TT Ads

అమరావతి:

స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చిన 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన ఏప్రిల్‌ 24వ తేదీని, జాతీయ పంచాయతీ దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాగా పని చేసిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీలలో కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేస్తోంది. ఆ మేరకు గత ఏడాది (2020)లో రాష్ట్రానికి 15 అవార్డులు రాగా, ఈసారి మొత్తం 17 అవార్డులు వచ్చాయి.
ఈ–పంచాయత్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి.
జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి ఇస్తారు.

వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని:
దేశ వ్యాప్తంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.
లాంఛనంగా వర్చువల్‌ విధానంలో అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి, అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అదే విధంగా మరో బటన్‌ నొక్కి, 7 రాష్ట్రాలలోని 5 వేల గ్రామాలలో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రధాని ప్రారంభించారు.
అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గత ఏడాది నుంచి చాలా చక్కగా పని చేస్తున్నాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందున, పంచాయతీలు అదే స్ఫూర్తితో పని చేయాలని, కోవిడ్‌ మహమ్మారికి సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీలలోనే ఆరంభం కావాలని ఆకాంక్షించారు.

అవార్డులు ప్రదానం చేసిన సీఎం:
అనంతరం సీఎం శ్రీ వైయస్‌ జగన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు.
ఈ–పంచాయత్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ పొందిన రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌కు అవార్డును ప్రదానం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత జిల్లా, మండల, పంచాయతీల అవార్డులు ఇచ్చారు.
జిల్లా స్థాయిలో గుంటూరు జిల్లా పొందిన అవార్డు (దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కారం)ను జడ్పీ సీఈఓ డి.చైతన్యకు, కృష్ణా జిల్లా పొందిన అవార్డును జడ్పీ సీఈఓ పీఎస్‌ సూర్యప్రకాశరావుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అందజేశారు.
అనంతరం మండల స్థాయిలో చిత్తూరు జిల్లా సొడెం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కారాలు (అవార్డులు) అందజేశారు.
ఆ తర్వాత పంచాయతీల స్థాయిలో కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, అదే జిల్లాకు చెందిన తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పు గోదావరి జిల్లా జి.రంగంపేట పంచాయతీలకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పురస్కారాలు ప్రదానం చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, ల్యాండ్‌ రికార్డ్స్‌ సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థజైన్‌తో పాటు, వివిధ జిల్లాల అధికారులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *