TT Ads

ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్‌ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి.కరోనా వైరస్‌ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సిమీటర్‌ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సిమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది.

కోవిడ్‌ రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. రోగుల్లో రక్తంలోకి చేరే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా పల్స్‌ ఆక్సిమీటర్‌ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు. కోవిడ్‌ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటవది సింప్టమాటిక్‌ కేసు. ఇందులో లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యేవాళ్లు, రెండవది అసింప్టమాటిక్‌ కేసు. అంటే ఒంట్లో వైరస్‌ ఉన్నా కూడా లక్షణాలు ఏవీ బయటపడని వాళ్లు. ఇక్కడ నష్టం ఎక్కువ జరిగేది అసింప్టమాటిక్‌ కేసులతోనే. ఎందుకంటే వీళ్లలో వైరస్‌ ఉన్నా లక్షణాలు కనిపించవు కాబట్టి టెస్ట్‌ చేసేవరకూ వీళ్లకు వైరస్‌ ఉన్నట్టు తెలియదు. దీంతో పక్కవాళ్లకు వైరస్‌ సోకే ప్రమాదముంది. అలాగే వాళ్ల శరీరంలో కూడా వైరస్‌ వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే లక్షణాలు పైకి కనిపించకపోయినా శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో మనమే కొన్ని పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు టెస్ట్‌ చేసుకుంటూ ఉండాలి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది పల్స్‌ ఆక్సిమీటర్‌.

కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సైలెంట్‌గా న్యుమోనియా కలిగిస్తుంది. అంటే పైకి కనిపించకుండానే ఊపిరితిత్తులు న్యుమోనియా వల్ల ఎఫెక్ట్‌ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి వ్యక్తి చనిపోవడానికి కారణమవుతుంది. కొంతమంది రోగుల్లో కోవిడ్‌ న్యుమోనియా లక్షణాలు ముందే బయటపడక పోవచ్చు. లేకుంటే వారం పది రోజుల తర్వాత బయటపడొచ్చు. కానీ ఈలోపు ఊపిరితిత్తులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఈ సైలెంట్‌ న్యుమోనియాను ముందుగానే గుర్తించగలిగితే రోగులను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన ఆవసరం రాకుండా ముందస్తు జాగ్రత్తలతో వాళ్ల ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

శరీరంలోని అన్ని భాగాలకు గుండె ఎలా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందో పల్స్‌ ఆక్సిమీటర్‌ గుర్తిస్తుంది.రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లాంటి వాటిలో ఈ మీటర్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. పల్స్‌ ఆక్సిమీటర్‌ వాడడం చాలా తేలిక. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్‌ను ఉంచి, ఒక్క బటన్‌ నొక్కితే చాలు. కొన్ని సెకన్ల తర్వాత డిస్‌ప్లేలో పల్స్‌ రేట్‌తోపాటు ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ రేటు కనిపిస్తుంది.

సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్‌ లెవల్‌ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్‌ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్‌.. ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా, ఎక్కువగా పెరిగినా ప్రమాదమని గుర్తించాలి. పల్స్‌ ఆక్సిమీటర్‌ ధర రూ.1,300 నుంచి రూ.ఐదువేల వరకు ఉంటుంది.ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి.చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఈ పరికరం ఉపయోగపడిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో అవసరం ఉటుందని భావిస్తున్న వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్స్‌ ఆక్సిమీటర్లకు డిమాండ్‌ పెరిగింది.

పల్స్‌ ఆక్సిమీటర్‌ పరికరాల అమ్మకాలు బాగా పెరిగాయి. అయితే ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటే మాత్రం తప్పనిసరిగా పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉంచుకోవడం మంచిది. దీని ద్వారా ఆక్సిజన్‌ లెవల్స్‌తోపాటు పల్స్‌ రేట్‌ను సులువుగా తెలుసుకోవచ్చు. ప్రమాదమని తెలిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించడానికి దోహపడుతుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *