TT Ads

కరోనా రెండో దశ తీవ్రంగా ఉంది. జనం ఆదాయానికి గండి పడింది. కరోనా మూడో దశ ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి…ఇదే అదనుగా ఖజానా నింపుకోవడంలో బిజీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నెల రోజుల్లో 20 సార్లు పెంచింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోటి యాభై లక్షల మంది పట్టణ ప్రజలపై భారాలు మోపడానికి కత్తులు నూరుతున్నది. ఏనాడు లేనివిధంగా చెత్తపై కూడా పన్ను (సేవా రుసుము) విధించడానికి, ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడానికి రంగం సిద్ధం చేసింది.

                                                             
చెత్తపై పన్ను – సిగ్గు సిగ్గు:ప్రతి పట్టణంలోనూ ఇంటి యజమానులే కాకుండా అద్దెదారుల నుండి కూడా నెలకు రూ. 60 నుండి రూ. 120 వరకు అంటే సంవత్సరానికి రూ. 720 నుండి రూ. 1440 వరకు, వ్యాపార సంస్థలపై నెలకు రూ. వంద నుండి రూ. పదిహేను వేల వరకు అంటే సంవత్సరానికి రూ. 1200 నుండి ఒక రూ. లక్షా 80 వేల వరకు కేటగిరీలను బట్టి వసూలు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమలు చేయడానికి మున్సిపల్‌ కౌన్సిళ్లు, అధికారులు పూనుకుంటున్నారు. దీని వలన రాష్ట్రంలో పట్టణ ప్రజలపై రూ. 750 కోట్ల భారం పడుతుంది. ప్రతి నెల 7వ తేదీ లోపు ఈ పన్ను చెల్లించాలి. లేకపోతే నివాసాలపై రూ. 10-15 వ్యాపార సంస్థలపై రూ. 50-100 ఫైన్‌ విధిస్తారు. అంతేకాకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయకపోయినా, ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, రోడ్లపై బట్టలు ఉతికినా రూ. 100 నుండి రూ. 2500 వరకు పెనాల్టీలు వసూలు చేయడానికి ఆదేశాలు వచ్చేశాయి. ఆఖరికి బహిరంగ సభ జరిపి నిర్వాహకులు శుభ్రం చేయకపోయినా పెనాల్టీ కట్టాల్సిందే. ప్రతి సంవత్సరం ఐదు శాతం తగ్గకుండా చెత్తపై యూజర్‌ చార్జీలు పెరుగుతాయి. అంతేకాదు పారిశుధ్య నిర్వహణ ఖర్చు మొత్తం అంటే సిబ్బంది వేతనాలు, వాహనాల ఆయిల్‌, రిపేర్లు ఇలా మొత్తం ఖర్చులు ప్రజలే భరించాలి. నిర్వహణ ఖర్చులు పెరిగితే ఆ మేరకు ప్రతి సంవత్సరం చార్జీలు పెరుగుతూనే ఉంటాయి.
 

కాటు వేయనున్న ఇంటి పన్ను:ఇంటి పన్ను (ఆస్తి పన్నులు) పెంచడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇంటిపన్ను అద్దె విలువ ఆధారంగా, సుమారు అద్దె విలువలో 15 నుంచి 20 శాతం వరకు ఇంటి పన్నుగా విధించే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చేశారు. ఆస్తి విలువ అంటే రిజిస్ట్రేషన్‌ శాఖ రేటు ప్రకారం స్థలం విలువ, కట్టడం విలువ రెండిటినీ లెక్కించి అందులో నివాస గృహాలపై 0.1 శాతం నుండి 0.5 శాతం వరకు, నివాసేతర, వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగించే కట్టడాలపై 0.2 శాతం నుండి రెండు శాతం వరకు పన్ను విధించడానికి చట్టాన్ని మార్చేశారు. దీనివలన ప్రస్తుతం ఉన్న పన్ను 10 నుండి 20 రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రతి సంవత్సరం భూముల విలువలు రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెంచుతుంది. భూముల విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం ఇంటి పన్ను ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. ఖాళీ స్థలాలపై కూడా 0.2 నుండి 0.5 శాతం వరకు సంవత్సరానికి పన్ను చెల్లించాలి. ఇల్లు ఉన్నా పన్నే, ఇల్లు కట్టకుండా ఖాళీగా ఉంచినా పన్ను కట్టాల్సిందే. శుభ్రంగా లేదనే పేరుతో మళ్ళీ అదనంగా మరొక 0.1 శాతం వరకు అదనంగా వసూలు చేసే అంశాన్ని చట్టంలో చేర్చారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు హడావుడిగా పన్నుల పెంపు ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎన్నికలో కౌన్సిళ్లు రాగానే ఈ ప్రక్రియ ఆగిపోతుందని ప్రజల భావించారు. ఈ సంవత్సరం పాత పన్నులే వసూలు చేయాలని ఏప్రిల్‌ లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ ఇంతలోనే మే నెలాఖరు నుండి మళ్లీ ఈ తంతు ప్రారంభించారు.
 

కేంద్రం సంస్కరణల ఎర.. లొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం:కరోనా మొదటి దశలో ప్రజలను ఆదుకునే పేరుతో ఆత్మనిర్భర భారత్‌ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రకటించింది. సంస్కరణల పేరుతో షరతుల ఎర వేసింది. రాష్ట్రం లోని వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం పూర్తిగా వీటికి లొంగిపోయింది. అందుకు కేంద్రం మెచ్చి రూ. 2,500 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి కేంద్రానికి ఇచ్చిన హామీలు అమలు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. గత సంవత్సరం మార్చిలో మున్సిపల్‌ చట్టాలను మార్చేశారు. 196, 197, 198 జీవోలు విడుదల చేశారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇంటి పన్నులే కాదు. మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీలను ఆయా మున్సిపాలిటీలలో అయ్యే నిర్వహణ ఖర్చు ఆధారంగా పూర్తిగా ప్రజల నుండి రాబట్టడానికి చట్టంలో పొందుపరిచారు. మంచి నీటి చార్జీలు నెలకు రూ. 100 నుండి రూ. 350 వరకు వసూలు చేయడానికి, దశలవారీగా ఇళ్లకు కూడా నీటి మీటర్లు పెట్టడానికి, మరుగుదొడ్లు ఇంట్లో ఎన్ని ఉన్నాయో లెక్కించి భూగర్భ డ్రైనేజీపై ఒకొక్క దొడ్డికి నెలకు రూ. 40 చొప్పున వసూలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మంచి నీరు, డ్రైనేజీ కనెక్షన్ల కోసం వేల రూపాయల డిపాజిట్లు ముందుగా చెల్లించాలి. ఈ చార్జీలు నిర్వహణ ఖర్చుల ఆధారంగా ప్రతి సంవత్సరం పెరుగుతాయి. ఇన్ని రకాల పన్నులు కట్టాలంటే ఇంట్లో ఉండాలా? లేక ఇల్లు అమ్ముకోవాలా?
                                          

ప్రజాద్రోహం:మున్సిపల్‌ ఎన్నికలలోను వైయస్‌ఆర్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఎన్నికల సందర్భంగా పన్నులు పెంచబోమని మాట ఇచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉండగా వైయస్‌ఆర్‌ నాయకులు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పన్నులు పెంచినప్పుడు నిరసన తెలిపారు. మేం అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాట ఇచ్చారు. కానీ నేడు మాట మార్చారు. ప్రజా ద్రోహానికి పాల్పడ్డారు. ప్రజలను భ్రమల్లో పెట్టి, మోసగించి, కళ్ళు కప్పి ఈ పన్నుల భారాలకు అందమైన ముసుగులు తగిలించి అమలు చేయడానికి కుట్రలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛభారత్‌ ముసుగులో కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రమైన నగరాలకు అవార్డులు ఇస్తామని ఎర వేసి రేటింగ్‌ ఇచ్చి ప్రజలను నమ్మించారు. కానీ చెత్త పన్ను ఎంత ఎక్కువగా, ఎంత సమర్ధవంతంగా వసూలు చేస్తే అంత ఎక్కువగా మార్కులు వేసి, మంచి రేటింగ్‌ ఇస్తారు. పట్టణాలలో నివాస గృహాల నుండి 75 శాతం, వాణిజ్య సంస్థల నుండి 90 శాతం వరకు చెత్త పన్ను వసూలు చేస్తే అవార్డుల్లో ముందు బాగానే ఉంచుతారు. ‘ప్రతి ఇంటి నుండి చెత్త సేకరిస్తాం. వాహనాలను మేమే ఇస్తాం. నిర్వహణా ఖర్చులు మాత్రమే మీరు భరించండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తియ్యటి కబుర్లు చెబుతూ ప్రజల నెత్తిన భారాలు రుద్దింది. అంతేకాదు ఇంటి పన్నులు 15 శాతం మించి పెరగవని నమ్మబలుకుతున్నారు. కానీ ఆ మాట చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. రూల్స్‌లో మాత్రమే పెట్టారు. నోటిఫికేషన్‌లో కనీసం ప్రస్తావించలేదు. రూల్స్‌ ఎప్పుడైనా మార్చవచ్చు. చట్టం శాశ్వతంగా ఉంటుంది. కొత్తగా నిర్మించే ఇళ్లకు ఆస్తి విలువను బట్టే పన్ను విధిస్తారు. తరువాత దశలవారీగా అన్ని ఇళ్లకు ఆస్తి పన్ను వేస్తారు. వారు చెప్పినట్టు సంవత్సరానికి 15 శాతం చొప్పున ఐదేళ్లు పెంచుకుంటూ పోతే 100 శాతం పెరిగిపోతుంది. ఇదొక కొత్త రకం మాయ. మొదట ముగ్గు లోకి దించి చాప కింద నీరులాగా అమలుచేయడం పాలకుల ఎత్తుగడ. చెత్త పన్ను రోజుకు 2 రూపాయలే కదా… 3 రూపాయలే కదా.. ఒక టీ తాగినంత ఖర్చు కూడా లేదంటూ ప్రజలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత అనేది సమస్య కాదు. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన స్థానిక సంస్థల, ప్రభుత్వాల బాధ్యత. ఇంటిపన్ను లోనే పారిశుధ్యం, మంచి నీరు, డ్రైనేజీ, లైటింగ్‌ నిర్వహణకు పన్నులు కూడా కలిపి ఉంటాయి. ఇంటి పన్నులో ఒక సారి అన్నిటికీ వసూలు చేస్తూ మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క సౌకర్యానికి పన్నులు వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. మునిసిపాలిటీలను ప్రజలకు సేవలు అందించే సంస్థలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా మార్చేశారు. పౌర సదుపాయాలను వ్యాపార సరుకులుగా మార్చేశారు. మొదట తక్కువగా ఉన్నా క్రమంగా పెరిగిపోతాయి. పన్నుల పెంపును వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం ఈ సంస్కరణలకు మూలమైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలేయాలి.
                                             

నిధులు బదలాయించాలి,కేంద్రం రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పైన పెత్తనం చేస్తూ ఏ పన్నులు, ఏ ఫీజులు ఎంత వుండాలో పైనుంచి రుద్దడం అప్రజాస్వామికం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తాయి. ఆ పన్నులలో స్థానిక సంస్థలకు వాటాను రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాలి. వాటి ఆధారంగా మున్సిపాలిటీలు నడవాలి. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను ప్రభుత్వాలు తమ ఖజానాలో వేసుకుని మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన గ్రాంట్లలో కోత పెట్టి, మీ పన్నులు, ఫీజులు పెంచుకోండి, మీ చావు మీరు చావండి. మేము గ్రాంట్లు ఇవ్వబోమని చేతులెత్తేయడం 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం. ఇక రాబోయే కాలంలో డబ్బు పెట్టి కొనుక్కోలేకపోతే కనీస సదుపాయాలూ కరువే. అందుకే పన్నులను వ్యతిరేకించడమే కాదు, పన్నులను విధిస్తున్న ప్రమాదకర విధానాలను కూడా ఎదుర్కోవాలి. ఎన్నికైన కౌన్సిళ్లు ప్రభుత్వ ఆదేశాలు తిరస్కరించేలా ఒత్తిడి తేవాలి. మరోవైపు పౌర సమాజాన్ని, అసోసియేషన్లను ఏకం చేసి ఉమ్మడిగా పోరాడాలి. తక్షణం ప్రభుత్వ ఆదేశాలు నిలిపివేయాలి. ఆస్తిపన్ను ప్రక్రియను నిలుపుదల చేయాలి. ప్రమాదకరమైన మున్సిపల్‌ చట్టం సవరణ రద్దు చేయాలి. ఆస్తి విలువను బట్టి కాకుండా అద్దె విలువను బట్టి పన్ను విధించే పాత పద్ధతే కొనసాగాలి. కరోనా కష్టాల్లో ఈ ఏడాది ఇంటి పన్ను పూర్తిగా రద్దు చేయాలి. ఆస్తి పన్ను, మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీల భారాలు వేసే 196, 197, 198 జీవో లను రద్దు చేయాలి. చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలి. ఇందుకై పోరుకు నడుం బిగించాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *