TT Ads

ఆమరావతి:కరోనా 2వ దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. ఏపీలో ఒక్క రోజులోనే 12634 కరోనా పాజిటివ్ కేసులు, 69 మరణాలు సంభవించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల టెస్టులు చేయించుకునేందుకు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. టెస్టుల ఫలితాలు వచ్చేందుకు నాలుగైదు రోజుల పమయం పడుతోంది. కరోనా రోగులకు వైద్యం అందక, బెడ్లు, ఆక్సిజన్ దొరకక అష్టకష్టాలూ పడుతున్నారు. విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. పరిమితికి మించి మార్చురీల్లో శవాలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. శ్మశానాల్లో అంత్యక్రియల కోసం భౌతికకాయాలు బారులుతీరి ఉ ండడం, కొన్నిచోట్ల సామూహిక దహనాలు జరగటం హృదయాన్ని ద్రవింపజేస్తోంది. పలుచోట్ల అంబులెన్సుల డ్రైవర్లు రోగులను తీసుకువెళ్లేందుకు వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి విలయంలో కనీస మానవత్వం లేకుండా ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్ రాబంధులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.

మహా విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదలాల్సిన తరుణంలో మీరు గ్రామాలకు ఇంటర్నెట్ పై సమీక్ష జరపడం ఇప్పుడున్న పరిస్థితులలో అవసరమా? అని ప్రశ్నిస్తున్నాం. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రధమ ప్రాధాన్యతనివ్వాల్సిన సమయంలో ఇతర అంశాల సమీక్షలకు, కక్షపూరిత రాజకీయాలకు, ప్రతిపక్షాలపై వేధింపులకు ఆస్కారమివ్వడం తగదు.
కరోనా మహమ్మారి ఇంతటి విలయం సృష్టిస్తుంటే పరీక్షల పేరుతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం విచారకరం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అతి త్వరగా కరోసా సోకే ప్రమాదం ఇప్పటికైనా గుర్తించండి. మీ పిల్లలుగా భావించి పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయండి. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు రు.5 వేల రూపాయల ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యవసర వస్తువులు అందించండి.

ఇప్పటికైనా కరోనా ఉదృతిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. రాజకీయాల కతీతంగా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన తరుణమిది. కావున తక్షణమే ఆన్ లైన్ లోనైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *