TT Ads

ఏపీలో ఎకో టూరిజంఅభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
సచివాలయం, పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నామని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సీఎస్ అధ్యక్షతన ఎకో టూరిజం డవలప్ మెంట్ కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఏపీ టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. దీనిలో భాగంగా సీఎస్…చైర్ పర్సన్ గా, టూరిజం డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎన్విరాన్ మెంట్, ఫారెస్టు డిపార్టుమెంట్ కార్యదర్శి వైస్ చైర్ పర్పన్లగా, ఏపీ టూరిజం ఆథారిటీ సీఈవో మెంటర్ కన్వీనర్ గా, మరో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో సుందరమైన అటవీ ప్రాంతాలను గుర్తించి, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఆయా అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతులతో కూడిన కాటేజీలు, హోటళ్ల ఏర్పాటుకు ఈ కమిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందన్నారు. వాటితో పాటు ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడల నిర్వహణకు ప్రోత్సాహించనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 అభయారణ్యాలు, ఒక టైగర్ రిజర్వు ఫారెస్టు, మూడు నేషనల్ పార్కులు ఉన్నాయన్నారు. వాటితో పాటు ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నాలుగు ఎకో రిసార్టులు ఉన్నాయన్నారు. వీటితో పాటు మరికొన్ని అటవీ ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ టూరిజం డవలప్ మెంట్ ఎండీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో దేశంలో ఎకో టూరిజం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 11 ప్రాంతాలు ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో రిస్టార్టులు, జంగిల్ లాడ్జిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూనే తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి ప్రణాళికలతో రావాలని సంబంధిత శాఖాధికారులను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *