TT Ads

ఆధునికతకు మారుపేరుగా అంగన్ వాడీ కేంద్రాలు,మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా.

23,510 కేంద్రాలకు నూతన భవనాలు,16,681 అంగన్ వాడీ భవనాల నవీకరణ.రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో పూర్తి,పారదర్శకతకు పెద్దపీట వేస్తూ శిక్షణలు.

అంగన్ వాడీ కేంద్రాలు సరి కొత్త రూపును సంతరించుకోనున్నాయి. కార్పోరేట్ హంగులతో ఆధునికతకు అలవాలంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం ఆలంబనగా చిన్నారులు నూతన అనుభూతిని సొంతం చేసుకోనున్నారు. అత్యాధునిక భవనాలు, మునుపెన్నడూ చూడని వసతులు, నూతనత్వం ఉట్టి పడే భోధనా పరికరాలు, సమతుల పోషకాహారం… ఇలా అన్ని ఒకే చోట లభించనున్నాయి. భావి భారత పౌరుల పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఈ నూతనత్వానికి కారణంకాగా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా ముందడుగు వేస్తుంది.

మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు మంచి అభ్యాస వాతావరణం, గర్భిణీ, చనుబాలిచ్చే మహిళలకు సురక్షితమైన స్ధితి గతులు ఉండేలా సొంత అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఉన్న భవనాల ఆధునీకరణ చేపడుతున్నామని ఈ సందర్భంగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ప్రతిష్టాత్మక నాడు నేడు ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతుండగా, భవిష్యత్తులో అద్దె భవనంలో అంగన్వాడీ అన్న మాటే ఉత్పన్నం కాబోదన్నారు. రాష్ట్రంలోని 23,510 నూతన అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, మరో 16,681 కేంద్రాల ఆదునీకరణను మూడు దశలలో పూర్తి చేయనున్నామన్నారు. అభివృద్ది పనులను పూర్తి పారదర్శకతతో చేపట్టేలా క్షేత్ర స్దాయిలో అంగన్‌వాడీ వర్కర్, సూపర్‌వైజర్. మహిలా సంరక్షణ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ (కన్వీనర్), అంగన్‌వాడీ కేంద్రంలో చేరిన 2-4 సంవత్సరాల వయస్సు గల పిల్లల ముగ్గురు తల్లులతో కూడిన ఏడుగురు సభ్యులతో అంగన్ వాడీ అభివృద్ది కమిటీ ఏర్పాటు చేసామని ఈ కమిటీ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్దతి ద్వారా పనులను పర్యవేక్షిస్తుందని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.

సొంత అంగన్వాడీ కేంద్రాల నవీకరణలో భాగంగా ప్రతి కేంద్రానికి రూ.6.90 లక్షలు కేటాయించటం జరిగిందని, పూర్తి స్దాయి నీటి సౌలభ్యంతో మరుగుదొడ్లు ,ట్యూబ్ లైట్, ఫ్యాన్స్‌ ఏర్పాటుతో విద్యుదీకరణ, అన్ని హంగులతో వంటగది, సురక్షిత త్రాగునీరు, సుందరమైన రంగులతో భవనాలు, కేంద్రం అవరణలోని ఆటస్ధలం ఆదునీకరణ, అవసరమైన మరమత్తులు, క్రీడా పరికరాలు, గ్రీన్ చాక్ బోర్డు, అవసరమైన ఫర్నిచర్, రిఫ్రిజిరేటర్, వాటర్ ఫిల్టర్లు సమకూర్చుతామన్నారు. నూతనంగా నిర్మించే మోడల్ అంగన్వాడీ కేంద్రాలకు రూ.14 లక్షలు వ్యయం చేస్తుండగా ఒక గది, వంటగది, సామాగ్రి నిల్వగది, మూత్రశాలలు, ఆటస్ధలం ఉంటాయని, 813 చదరపు అడుగుల పునాది విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మాణం జరుగుతుదన్నారు. ఆధునీకరణలో సమకూరనున్న అన్ని వసతులు నూతన భవనాలలో కూడా ఏర్పాటు అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఆర్ఇజిఎ నిధులు, పట్టణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా అంగన్వాడీ కేంద్రం వెంబడి ప్రహరీ గోడలు నిర్మిస్తారన్నారు.

నిధుల వినియోగం విషయంలో పూర్తి స్పష్టత ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని, రివాల్వింగ్ ఫండ్‌ను ఆర్థిక శాఖ ఎపిఎస్‌హెచ్‌సిఎల్‌కు, అక్కడి నుంచి అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ ఉమ్మడి బ్యాంకు ఖాతాకు విడుదల చేస్తామని కృతికా శుక్లా తెలిపారు. ఈ పనుల పరిశీలన కోసం ఎపిఎస్‌హెచ్‌సిఎల్ ప్రత్యేకంగా నాణ్యత నియంత్రణ సేవలను అందించనుండగా, మరోవైపు మొత్తం నిర్మాణాలు, ఆధునీకరణ ప్రాజెక్టులలో కనీసం 20శాతం యూనిట్లను తనిఖీ చేయటం ద్వారా నాణ్యతలో రాజీ పడకుండా పనులు సాగేలా చూస్తామన్నారు. సమర్థవంతమైన పర్యవేక్షణ, అధిక పారదర్శకత కోసం ఎండ్ టు ఎండ్ లావాదేవీ ఆధారిత సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది), ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఐటిడిఎలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని జిల్లాల్లో నాయకత్వాన్ని అందించవలసి ఉందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతిక శుక్లా తెలిపారు.

పూర్తి స్ధాయి అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు,నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అంగన్ వాడీ కేంద్రాలు పునర్ నిర్మాణం, నూతన భవనాల నిర్మాణం విషయంలో పూర్తి అవగాహన కల్పించే క్రమంలో రాష్ట్ర స్థాయిలో మార్చి 16,17 తేదీల్లో, జిల్లా స్థాయిలో మార్చి 23,24 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నామని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీలకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాలు ఏప్రిల్ 6 నుంచి 9 వరకు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి శిక్షణలో నలుగురు సిడిపిఓలు, గృహ నిర్మాణ శాఖ డిఇ ఉంటారని, జిల్లా స్థాయి శిక్షణను అందరు సిడిపిఓలు, గృహ నిర్మాణ శాఖ డిఇ, మండల స్ధాయి ఇంజనీరింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లకు అందిస్తామన్నారు. మండల స్థాయి శిక్షణను అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ (కన్వీనర్), అంగన్‌వాడీ వర్కర్, సూపర్‌వైజర్. మహిలా సంరక్షణ కార్యదర్శి, అంగన్‌వాడీ కేంద్రంలో చేరిన 2 నుండి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లల ముగ్గురు తల్లులకు అందించి వారికి పూర్తి స్దాయిలో విషయం అవగతం అయ్యేలా చూస్తామన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *