TT Ads

కరోనా మహమ్మారి విసిరిన భారీ సవాలును ఎదుర్కోవటానికి ఉపకులపతి మొదలు విద్యార్ధి వరకు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అదృశ్య శత్రువుపై అందరూ సమిష్టిగా యుద్దం చేస్తేనే వైరస్‌ గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామన్నారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా ఉన్నత విద్యసంస్ధలలో కరోనా పరిస్ధితులను అధికమించటం, విద్యార్ధుల ద్వారా కరోనా వ్యతిరేక అవగాహనా ప్రచారం నిర్వహించటంపై గవర్నర్ రాష్ట్రంలోని అయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వెబినార్ విధానంలో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ అచార్య కె. హేమచంద్రరెడ్డి, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాజ్ భవన్ నుండి కార్యక్రమంలో పాల్గొనగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు దృశ్యశ్రవణ మాధ్యమ విధానంలో సదస్సులో పాల్గొన్నారు.

రెండోవ విడత కరోనా వ్యాప్తి వేగవంతమైన తరుణంలో విద్యాసంస్ధలలో అవసరమైన అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ప్రజల పట్ల పెద్ద బాధ్యత కలిగిఉన్నాయని, ప్రజలలో అవగాహన కలిగించేందకు కృషి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తమను తాము కాపాడుకుంటూ అటు కుటుంబానికి, ఇటు సమాజానికి మధ్య దూతలుగా వ్యవహరించాలని సూచించారు.  గౌరవ బిశ్వభూషణ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్‌సిసి,ఎన్‌ఎస్‌ఎస్ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో విజయం సాధించడానికి మనమంతా కలిసి యుద్దప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యావశ్యకమన్నారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల నేపధ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయిడు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, ఏప్రిల్ 14న ముఖ్యమంత్రులతో సమీక్షించారని, ‘పరీక్షలు, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ప్రవర్తనా నియమావళి అమలు,  టీకా’ అనే ఐదు అంశాల వ్యూహాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారని గవర్నర్ గుర్తు చేసారు.

 పౌర సమాజం, ప్రముఖ వ్యక్తులు,మత పెద్దలు,ప్రజా ప్రతినిధులతో పాటు, కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు చురుకైన ప్రచారం చేపట్టాలని ప్రధాని సూచించారన్నారు. ఇప్పటికే రెడ్ క్రాస్ ప్రతినిధులతో రాష్ట్ర స్దాయి సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలకు అదేశాలు జారీ చేసామని, అయా జిల్లా యంత్రాంగాలతో రెడ్ క్రాస్ యూనిట్లు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ 19 వైరస్ మన దైనందిన జీవితాన్ని స్తంభింప చేయటమే కాక, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు.  కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోని ప్రతి విద్యార్థి రెడ్‌క్రాస్ మొబైల్ యాప్ ఉపయోగించి తగిన ప్రచారాన్ని చేపట్టాలన్నారు. విద్యార్ధులు ప్రతిరోజూ కనీసం ఐదు ఇళ్లను సందర్శించి రెడ్ క్రాస్ యాప్ ద్వారా  సామాజిక నిఘా వైపు దృష్టి సారించాలని సూచించారు.

 సామాజిక నిఘాలో విద్యార్ధుల పాత్రకు సంబంధించి రాజ్ భవన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తుందని , ప్రతి జిల్లాలో 10 ఉత్తమ కళాశాలలు, రాష్ట్రంలోని 3 ఉత్తమ విశ్వవిద్యాలయాలను ఇందుకు ఎంపిక చేస్తామని గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ స్పష్టం చేసారు. కరోనాను ఎదుర్కునేందుకు యోగా వంటి భారతీయ వైద్య విధానాలను, సాధారణ దేశీయ చిట్కాలను పాటించాలని సూచించారు. అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లో ఉండమని సలహా ఇవ్వాలని, ఎవరికైనా జ్వరం,దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వారు వెంటనే పరీక్షకు వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలని విద్యార్ధులు సూచించాలన్నారు. ప్రజలలో కరోనాపై అవగాహన కల్పించడానికి ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఉపకులపతులు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, విస్రృత స్దాయి ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆదేశించారు. 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యార్ధుల ప్రచార ఉద్యమానికి రెడ్ క్రాస్ తగిన తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. అకడమిక్ క్యాలెండర్ మేరకే అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని విసిలకు సూచించారు. కరోనా నేపధ్యంలో విశ్వవిద్యాలయాలలో చేపట్ట వలసిన విభిన్న అంశాలను త్వరిత గతిన పూర్తి చేయాలని వివరించారు. విద్యా సంస్ధలలో కరోనా నివారణ చర్యల పరంగా ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంబిస్తుందని మంత్రి సురేష్ గవర్నర్ కు వివరించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యలయాల ఉపకులపతులు తాము చేపట్టబోతున్న చర్యలను గురించి గవర్నర్ కు వివరించారు. 
TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *