TT Ads

ప్రపంచ మేధావి, రాజకీయవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలు నేటితరం ఆచరించాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన డా. బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు మట్టిముద్ద లాంటివారు వాళ్లని ఎలా మలిస్తే అలానే తయారవుతారు కాబట్టి బాల్యదశ నుంచి కుల, మతాల గురించి కాకుండా అందరూ సమానమనే భావనను పెంపొందించాలని, సామాజిక మార్పునకు ప్రయత్నించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. అంబేడ్కర్, గాంధీజీ, మదర్ థెరిసా వంటి మహనీయుల గురించిన పుస్తకాలు పిల్లల చేత ఎక్కువగా చదివించాలని, అప్పుడే పిల్లల్లో ఆదర్శభావాలు పెరగడంతో పాటు స్వేచ్ఛా సమానత్వం, శాస్ర్తీయత గురించి ఆలోచించే భావాజాలాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలని అన్నారు. అందుకు విద్యాశాఖకు ఒక మంచి అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా పని చేసి అంబేడ్కర్ ఆశయాలను సాధించాలని కోరారు.

అనంతరం పాఠశాల విద్య సలహాదారు ఆకునూరి మురళి ప్రసంగిస్తూ కుల వివక్ష వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువు ఓ తపస్సుగా భావించి చదువుకు కులం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి అంబేడ్కర్ అని, కొన్ని కోట్ల మంది జనాలకు ఆయన స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు.

సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ అంబేడ్కర్ అనగానే కులానికి పరిమితం చేయకూడదని గొప్ప వ్యక్తిగా, మేధావిగా గుర్తించాలని అన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలు పాటించాలని సూచిస్తూ, ఇప్పటికీ కులాంతర వివాహాల దగ్గర ఇబ్బందులు పెట్టడం, వీధుల్లో కూడా ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయడం వంటివి మార్పు చెందాలని, అందరూ సమానత్వంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య సలహాలదారు, సమగ్ర శిక్షా రాష్ర్ట పథక సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా సిబ్బంది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *